Magazines

ఎల్ నినో దెబ్బకు..పత్తి రైతుల విలవిల..

5 రోజుల క్రితం

Cotton farmers
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 3 నిమిషాల చదవడం

•పత్తి పంటలపై ప్రకృతి పగ 

•మూడుసార్లు నాటిన విత్తనాలు 

•ధర ఉన్న పత్తి లేని పరిస్థితి 

•అప్పుడే లూటీ పోతున్న పత్తి చేనులు 

•ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ 

నవతెలంగాణ-మర్రిగూడ 

వ్యవసాయం పండగ అనే స్థాయి నుండి వ్యవసాయం దండగ అనే స్థాయికి దిగజారుతుంది రోజురోజుకు మండలంలోని రైతుల పరిస్థితి.కొన్ని రోజులు ప్రభుత్వాలు పెట్టిన ఫర్టిలైజర్ యాప్ లు,యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఎల్ నినో ప్రకృతి విపత్తు పెనుభూతమైతాకింది.ఎల్ నినో ప్రభావంతో సరైన సమయంలో వర్షాలు కురవక చెబితే చెరువు నిండుతుంది బాద అనే రీతిగా ఉంది ప్రస్తుతం మండల పత్తి రైతుల పరిస్థితి.మండలంలో 90 శాతం ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తారు.మండలంలో ప్రధాన పంట పత్తి.మండల వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్ కి వ్యవసాయ అధికారుల నివేదికల ప్రకారం 18 గ్రామ పంచాయతీలలో 19200 ఎకరాలలో రైతులు పత్తి పంటను సాగు చేశారు.

ఎల్‌నినో ప్రభావంతో పత్తి పంటకు దెబ్బ..

గతంతో పోలిస్తే ఈ ఏడాది ఖరీఫ్ కు వాతావరణ ప్రభావం దృష్ట్యా మండలంలోని రైతులు పత్తి పంటను కొంత తక్కువ సాగు చేశారు.విత్తనం నాటిన నాటీ నుండి సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో విత్తనాలు కొన్నిచోట్ల మూడుసార్లు పెట్టారు.ఇక విత్తనం మొలకెత్తిన నాటినుండి వర్షాలు తగ్గుముఖం పట్టడం ఉష్ణోగ్రతలు పెరగడంతో మొక్క ఎదుగుదల ఆగింది.ఎండ తీవ్రతకు పిందెలు రాలిపోవడంతో పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది.

పెట్టుబడి పెరిగింది..దిగుబడి తగ్గింది

వాతావరణ పరిస్థితులకు తోడు విత్తనాలు,ఎరువులు,పురుగుమందుల ధరలు పెరగడంతో పత్తి పంట సాగుకు పెట్టుబడి అధికంగా వస్తుంది.ఈ గడ్డు పరిస్థితిలో కూడా రైతులు ఎకరకి 30 నుంచి 50 వేల వరకు పెట్టుబడి పెట్టారు.ఎల్ నినో ప్రభావంతో చెట్టుకు ఒకటి రెండు కాయలు మాత్రమే పడడంతో గతంలో ఎకరాకి సగటున 10 నుండి 15 క్వింటాలు వచ్చిన పంట దిగుబడి ఈసారి కేవలం ఎకరాకి ఒకటి రెండు క్వింటాలు మాత్రమే వస్తుంది.కొన్నిచోట్ల పంటలు అప్పుడే లూటీ పోయిన పరిస్థితి కూడా మండలంలో కనబడుతుంది.తద్వారా రైతులకు ఆశించినంత ఆదాయం రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు.

మద్దతు ధర ఉన్న పత్తి లేని పరిస్థితి 

మండలంలో గతంలో ఎప్పుడైనా ప్రతి పత్తి రైతుకు ఎకరాకు సగటున 10 నుండి 15 క్వింటాలలో దిగుబడి వచ్చేది.ప్రభుత్వ మద్దతు ధర తక్కువగా ఉన్న దిగుబడి శాతం ఎక్కువ ఉండడంతో రైతుకు పెట్టుబడి పోను కొంత ఆదాయం మిగిలేది.ఈ ఖరీఫ్ సీజన్లో ఎల్ నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదు,అధిక ఉష్ణోగ్రతలతో పత్తి పంటలు ఎండిపోవడంతో దిగుబడి శాతం తీవ్రంగా తగ్గింది.మద్దతు ధర ఉన్న ప్రస్తుతం మండలంలోని గ్రామాలలో పత్తి లేని పరిస్థితి కనబడుతుంది.

అప్పుల ఊబిలో పత్తి రైతులు

పంట దిగుబడి తగ్గడం,కొన్నిచోట్ల పంట పూర్తిగా ఎండిపోవడంతో మండల పత్తి రైతుల పరిస్థితి అద్వానంగా ఉన్నది.పంట పెట్టుబడికి ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద,బ్యాంకుల వద్ద అప్పులు తేవడంతో ఆ అప్పు ఎలా తీర్చాలని రైతుల ఆవేదన చెందుతున్నారు.కుటుంబ పోషణ,పిల్లల చదువులు భారంగా మారడం,పంట వేసిన నాటినుండి ప్రకృతి వైపరీత్యాలు రైతులకు శాపంగా మారి రైతు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

ప్రభుత్వానికి పత్తి రైతుల విజ్ఞప్తి

పంట నష్టంపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి,అర్హులైన రైతులకు పంట నష్టపరిహారం అందించాలని,పంటల బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని,రైతులకు పెట్టుబడి సాయం అందించాలని,ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఫర్టిలైజర్ యాప్ ల ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మండల పత్తి రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఎకరాకి 20వేల ఆర్థిక సాయం అందించాలి 

•ఏర్పుల యాదయ్య (సిపిఐఎం మండల కార్యదరి)

ఎల్ నినో ప్రభావంతో పంటలు ఎండిపోయి మండల రైతులు అప్పుల కొరల్లో చిక్కుకున్నారు.ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పంట సర్వే చేసి తక్షణమే రైతులకు పంటలకు నష్టపరిహారం అందించాలని.అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రైతులకు ఎకరాకి 20వేల రూపాయల రైతు భరోసా అందించాలి.కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి.

33 శాతం ఉంటేనే పంటకు నష్టపరిహారం 

•మర్రు సాహస్ (మండల వ్యవసాయ అధికారి మర్రిగూడ)

పంట నష్టం 33 శాతం ఉంటేనే పంటకు నష్టపరిహారం వర్తిస్తుంది.పంట నష్టం పై సర్వే చేయమని అధికారుల నుండి ఏలాంటి అప్డేట్స్ రాలేదు ఈ వన్ టు డేస్ లో రావచ్చు.కరువు మండలానికి వచ్చే బెనిఫిట్స్ పై ఇంకా సమాచారం లేదు.అదేవిదంగా కౌలు రైతుల సమస్యలపై కూడా ఎలాంటి నివేదికలు అందలేదు.

10 ఎకరాలకు 9 క్వింటాలు అయ్యింది 

•గొడ్డటి నరేష్ (రైతు,దామెర భీమనపల్లి)

నేను పది ఎకరాలలో పత్తి పంటను సాగు చేశాను.పంట సాగుకు 2 లక్షల పెట్టుబడి అయింది.ఎల్ నినో ప్రభావంతో ఇప్పటివరకు కేవలం 9 క్వింటాలు మాత్రమే ఎల్లింది.దాదాపు పంట పూర్తిగా లూటీ పోయే స్థాయికి చేరుకుంది.ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్