Magazines

వరి విత్తనాలపై రైతుల ఆగ్రహం

2 గంటల క్రితం

rice seeds
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 2 నిమిషాల చదవడం

150 నుంచి 200 ఎకరాల్లో సాగు.. ఆశించిన స్థాయిలో ఎదగని పంట

విక్రమ్ ఫర్టిలైజర్ దుకాణం ఎదుట రైతుల బైఠాయింపు..
విత్తనాల నాణ్యతపై విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్

నవతెలంగాణ – పరకాల

వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి వరి సాగు చేసినా ఆశించిన స్థాయిలో పంట ఎదగకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. విత్తనాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ శాయంపేట మండలంలోని జోగంపల్లి, మైలారం, పెద్దకోడెపాక గ్రామాలకు చెందిన పలువురు రైతులు పరకాల పట్టణంలోని విక్రమ్ ఫర్టిలైజర్ దుకాణం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు 150 నుంచి 200 ఎకరాల్లో సాగు చేసిన సిద్ధి 44 రకం వరి పంట ఆశించిన స్థాయిలో ఎదగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

200 ఎకరాల్లో సిద్ధి 44 సాగు

రైతుల కథనం ప్రకారం.. మంగళ సీడ్స్‌కు చెందిన సిద్ధి 44 రకం వరి విత్తనాలను కొనుగోలు చేసి సుమారు 200 ఎకరాల్లో సాగు చేశారు. ఈ రకం వరి పంట కాలం 152 రోజులకు పైగా ఉంటుందని రైతులు తెలిపారు. అయితే పంట ఎదుగుదల ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు పంట దిగుబడి సమయం కూడా ముగిసింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ‌ పెట్టుబడులు తిరిగి వస్తాయా లేదా అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగు కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడంతో ఆర్థికంగా నష్టపోతామేమోనని ఆవేదన చెందుతున్నారు.

విత్తనాల నాణ్యతపై అనుమానాలు

పంట ఎదుగుదల మందగించడానికి విత్తనాల నాణ్యతలో లోపాలున్నాయా? సాగు విధానంలో ఏమైనా సమస్యలున్నాయా? లేక వాతావరణ పరిస్థితులు ఇతర కారణాలుగా ఉన్నాయా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, శాస్త్రీయంగా కారణాలను నిర్ధారించాలని రైతులు కోరుతున్నారు. విత్తనాల నాణ్యతలో లోపాలు ఉన్నట్లు తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, పంట నష్టాన్ని అంచనా వేసి అర్హులైన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

విక్రమ్ ట్రేడర్స్ యజమాని తాటిపెళ్లి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ.. సిద్ధి 44 రకం వరి పంట కాలం 152 రోజులకు పైగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం సూచించిన వరి వంగడాల్లో సిద్ధి 44 రకానికి ప్రాధాన్యం ఉండటంతోనే రైతులు ఈ పంటను సాగు చేశారని పేర్కొన్నారు. మంగళ సీడ్స్ కంపెనీగానీ, విక్రమ్ ట్రేడర్స్‌గానీ రైతులను మోసం చేసిన పరిస్థితులు లేవన్నారు. ఎల్‌నినో ప్రభావం కూడా పంట దిగుబడిపై ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రైతులకు ఎంతోకాలంగా నమ్మకంగా సేవలందిస్తున్న విక్రమ్ ట్రేడర్స్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలు నిర్ధారిస్తాం

పరకాల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతులు సాగు చేసిన వరి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంట ఎదుగుదలలో సమస్యకు గల కారణాలను తెలుసుకుంటామని తెలిపారు. శాయంపేట, పరకాల వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. విత్తనాల నాణ్యత, సాగు పరిస్థితులు, ఇతర సంబంధిత అంశాలను పరిశీలించి వాస్తవాలను నిర్ధారిస్తామని చెప్పారు. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Farmers' angerన్యాయం చేయాలని రైతుల డిమాండ్

పంట చేతికొచ్చే సమయంలో ఆశించిన దిగుబడి రాకపోతే రైతుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమస్యను తేలికగా తీసుకోకుండా వెంటనే స్పందించాలని కోరుతున్నారు. సంబంధిత గ్రామాల్లో పంటల పరిస్థితిని పరిశీలించి, రైతుల నుంచి వివరాలు సేకరించి వాస్తవాలను నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు. విచారణను త్వరగా పూర్తి చేసి, నష్టం జరిగినట్లు తేలితే బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్