సొంత కారు వినియోగిస్తూ నెలకు రూ.33 వేల భత్యమా?
ఆలేరు నీటిపారుదల శాఖ డీఈఈపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
నవతెలంగాణ-ఆలేరు రూరల్
ఆలేరు నీటిపారుదల శాఖలో విధులు నిర్వహిస్తున్న డీఈఈ శ్రీనివాసరెడ్డిపై అద్దె కారు పేరుతో ప్రతి నెలా రూ.33 వేల వరకు ప్రభుత్వ నిధులు పొందుతున్నారని ఆరోపిస్తూ పట్టణానికి చెందిన దయ్యాల సంపత్ సోమవారం ఫిర్యాదు చేశారు. ఆలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు. డీఈఈ అధికారిక అవసరాల కోసం సొంత కారును వినియోగిస్తున్నప్పటికీ, అద్దె కారు, ప్రయాణ ఖర్చుల పేరుతో ప్రతినెలా రూ.33 వేల వరకు ప్రభుత్వ నిధులు పొందుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతేకాకుండా ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) కూడా ప్రభుత్వ ఖజానా నుంచి పొందుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిధులు ప్రజా అవసరాలకు వినియోగించాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా భత్యాలు పొందడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక నష్టం వాటిల్లుతోందని తెలిపారు. ఈ వ్యవహారంపై గతంలోనూ పలుమార్లు ప్రశ్నించినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించడం లేదని పేర్కొన్నారు. సంబంధిత రికార్డులను పరిశీలించి, అద్దె కారు బిల్లులు, ప్రయాణ భత్యాలు, హెచ్ఆర్ఏ చెల్లింపులపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని ఫిర్యాదుదారుడు కోరారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ ఫిర్యాదుపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.







కామెంట్లు (0)