కోలనుపాకలో మెడిసిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రేపు వైద్య సేవలు
నవతెలంగాణ – ఆలేరు రూరల్
పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు పరిమితం చేయకుండా.. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంగా నిర్వహించాలనే ఆలోచనతో ఓ కుటుంబం ముందడుగు వేసింది. చిన్నారి గ్రీష్మ మొదటి పుట్టినరోజు సందర్భంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా కోలనుపాకలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆలేరు మండలం కోలనుపాక గ్రామానికి చెందిన దూడల సాగర్, అంబిక దంపతుల కుమార్తె గ్రీష్మ జన్మదినాన్ని పురస్కరించుకొని మెడిసిటీ హాస్పిటల్స్, ఘనపూర్, మేడ్చల్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించనున్నారు.
రేపు బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కోలనుపాక గడి వద్ద రైతు వేదిక ఆవరణలో వైద్య శిబిరం కొనసాగనుంది. అనుభవజ్ఞులైన వైద్యులు వివిధ ఆరోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందించనున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు, ప్రకటించిన వైద్య సేవల పరిధిలో ఉచిత శస్త్రచికిత్సలు కూడా చేయనున్నారు.
చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకూ పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో గ్రామంలోనే వివిధ విభాగాల వైద్య సేవలు అందుబాటులోకి రావడం ప్రజలకు ఉపయోగకరంగా మారనుంది. కోలనుపాకతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాలకు దూడల సాగర్, సెల్: 6281190853 సంప్రదించాలని తెలిపారు.






కామెంట్‌లు (0)