భిన్న వాతావరణం
ఇబ్బందులు పడుతున్న వృద్ధులు
నవతెలంగాణ - మల్హర్ రావు
మండలంలో భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పగలు ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతుండగా..చీకటి పడడంతోనే కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. దీంతో ప్రజలు పగటిపూట ఎండ వేడిమిని, రాత్రి చలిని తట్టుకోలేకపోతున్నారు. గత రెండు మూడు రోజులుగా పగలు గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా, రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు నమోదవుతోంది. ఉదయం 10 గంటల నుంచే ఎండల తీవ్రత పెరగడంతో కూలీలు, రైతులు, వీధి వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ చలికి వృద్ధులు, చిన్నారులు వణికిపోతున్నారు. చలి తీవ్రత మున్ముందు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
చలితీవ్రత నుంచి ఉపశమనానికి గ్రామీణులు చలిమంటలు వేసుకుంటున్నారు. అటవీ ప్రాంతం చేరువలో ఉన్న కిషన్ రావు పల్లి, నాచారం, ఆన్ సాన్ పల్లి, మల్లంపల్లి, కొయ్యుర్, ఎడ్లపల్లి గ్రామాల్లో చలి ప్రభావం అధికంగా ఉంటోంది. వాతావరణ మార్పులతో ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. చిన్నారులు, వృద్ధులు జలుబు, దగ్గు, జ్వరం బారిన పడుతున్నారు. చలి తీవ్రత వల్ల అస్తమా, ఉబ్బసం వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
దాహం వేసినా వేయకపోయినా గంటకోసారి నీరు తాగాలి. మజ్జిగ తీసుకోవాలి. వీలైతే కొబ్బరి నీళ్లు, నిమ్మరసం కూడా తీసుకుంటే మంచిది. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో తిరగకుండా ఉండడం మంచిది. తప్పనిసరైతే గొడుగు లేదా టోపి, కళ్లద్దాలు ధరించాలి. తెలుపు, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. చలి మంట కాగుతున్న గ్రామీణులు శరీరాన్ని పూర్తిగా కప్పేలా చూసుకోవాలి.వే డి చేసే మసాలా, నూనె వంటకాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, పెరుగు ఎక్కువగా తీసుకోవాలి. రాత్రివేళ చలి నుంచి రక్షణకు దుప్పట్లు, స్వెట్టర్లు తప్పనిసరిగా వాడాలి. చలి వల్ల చర్మం పొడిబారకుండా వాజ్ లెన్ వంటి క్రీము రాసుకోవాలి. అస్తమా వ్యాధిగ్రస్తులు, చిన్నారులు, వృద్ధులు గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.






కామెంట్లు (0)