Magazines

అశ్వారావుపేటలో భారీ నష్టం..

2 గంటల క్రితం

Huge damage
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 06, 2026 | 2 నిమిషాల చదవడం

- వెంకమ్మ చెరువు గండిని పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

- పంట నష్టం, రహదారుల మరమ్మతులపై తక్షణ నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం

నవతెలంగాణ - అశ్వారావుపేట

మురసు తుఫాన్‌ ప్రభావంతో అశ్వారావుపేట మండలంలో కురిసిన అత్యంత భారీ వర్షాలకు గండిపడిన వెంకమ్మ చెరువును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం పరిశీలించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. రైతులకు జరిగిన పంట నష్టంతో పాటు దెబ్బతిన్న రహదారులు, చెరువులు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు.


ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మురసు తుఫాన్‌ ప్రభావంతో అశ్వారావుపేట ప్రాంతంలో అత్యంత భారీ వర్షపాతం నమోదైందన్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలుచోట్ల ఆకస్మిక వరదలు సంభవించాయని తెలిపారు. భారీ వరదల కారణంగా ఉద్యాన పంటలు, వరి పంటలు నీట మునిగి రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. పలు ప్రాంతాల్లో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. పంట నష్టం, దెబ్బతిన్న రహదారులు, చెరువులు, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన పూర్తి వివరాలతో ఈరోజు సాయంత్రంలోగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. తుఫాన్‌ కారణంగా జరిగిన నష్టంపై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేసి బాధితులకు తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


ప్రతికూల వాతావరణంలోనూ పామాయిల్ రైతులకు భరోసా

అత్యంత భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పటికీ పామాయిల్‌ సాగుకు పెద్దగా నష్టం వాటిల్లకుండా పంట నిలబడటం విశేషమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అతివృష్టి, అనావృష్టి వంటి అసమతుల్య వాతావరణ పరిస్థితులు తరచూ ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో పామాయిల్‌ సాగు రైతాంగానికి ఒక వరంగా మారుతోందని ఈ పరిస్థితులు మరోసారి నిరూపించాయని అన్నారు.

రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పంట నష్టం అంచనా, రహదారుల పునరుద్ధరణ, గండిపడిన చెరువుల మరమ్మతులకు తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.


మంత్రి వెంట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఆత్మ (బీఎఫ్ఏసీ) చైర్మన్‌ సుంకవల్లి వీరభద్రరావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జూపల్లి రమేష్‌బాబు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ, తహసీల్దార్‌ దాసరి కిశోర్‌, ఎంపీడీవో వాల్మీకి కిశోర్‌, ఐబీ, ఆర్అండ్‌బీ, పీఆర్‌ శాఖల డీఈలు వెంకటేశ్వరరావు, ప్రకాశ్‌, శ్రీధర్‌, కాంగ్రెస్‌ నాయకులు బండి పుల్లారావు, మొగళ్లపు చెన్నకేశవరావు, తుమ్మ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్