- ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతులు హెచ్చరిక
నవతెలంగాణ-సత్తుపల్లి
మహిళా ప్రజాప్రతినిధులను ఉద్దేశించి కొందరు వ్యక్తులు చేస్తున్న అనుచిత, అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక అధికారిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ విలేకరులతో మాట్లాడారు.
మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం, వాట్సాప్లో విద్వేషకర మెసేజ్ లు పంపడం ఏమాత్రం సమర్థనీయం కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు హుందాగా, నిర్మాణాత్మకంగా ఉండాలని, ఎవరి హద్దుల్లో వారు ఉంటే మంచిదని హితవు పలికారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత 30 సంవత్సరాలుగా తాము ప్రజాసేవలో కొనసాగుతున్నామని, ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. పదవులు ఉన్నా, లేకపోయినా నిరంతరం ప్రజల్లో ఉండటమే తమ నైజమని స్పష్టం చేశారు. రాజకీయా లలో సహజమైన విమర్శలను స్వాగతిస్తామని, కానీ వ్యక్తిత్వాన్ని కించపరిచే అసత్య ఆరోపణలను సహించేది లేదని తేల్చిచెప్పారు. ప్రజల ఆశీర్వాదం, నమ్మకమే తమ బలమని... ఇటువంటి విమర్శలకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు స్పష్టం చేశారు.






కామెంట్లు (0)