- మత్తు పదార్థాలు కలిపిన బీరు ఇచ్చి బంగారు ఆభరణాల చోరీ
- ఐదుగురు నిందితుల అరెస్ట్.. 14 కేసులు ఛేదించిన పోలీసులు
నవతెలంగాణ-నాచారం: డేటింగ్ యాప్ ద్వారా పరిచయాలు పెంచుకుని, బాధితుల నమ్మకాన్ని సంపాదించిన అనంతరం వారి ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రైండర్ డేటింగ్ యాప్ను వేదికగా చేసుకుని బాధితులతో పరిచయాలు పెంచుకుని, బీరులో మత్తు పదార్థాలు కలిపి తాగించి, వారు స్పృహ కోల్పోయిన తర్వాత బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను అపహరిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ముఠాకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేయగా, వివిధ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన 14 కేసులను పోలీసులు గుర్తించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు గ్రైండర్ యాప్లో ఖాతాలు తెరిచి ఆన్లైన్ చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా బాధితులతో పరిచయాలు పెంచుకునేవారు. వారి వ్యక్తిగత వివరాలు, నివాస చిరునామాలు, ఒంటరిగా ఉంటున్నారా, బంగారు ఆభరణాలు ఉన్నాయా అనే సమాచారాన్ని సేకరించేవారు. అనంతరం వ్యక్తిగతంగా కలిసే నెపంతో వారి ఇళ్లకు వెళ్లి బీరులో మత్తు పదార్థాలు కలిపి ఇచ్చేవారు. బాధితులు స్పృహ కోల్పోయిన తర్వాత బంగారు గొలుసులు, ఉంగరాలు తదితర ఆభరణాలను దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యేవారు.
నమ్మదగిన సమాచారం మేరకు నవంబర్ 16న ఉప్పల్, కుషాయిగూడ పోలీసుల ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశాయి. ముగ్గురిని ఉప్పల్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉదయం 10 గంటల సమయంలో ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరిని ఏఎస్రావు నగర్ వద్ద కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్టయిన వారిలో తేజావత్ సంతోష్ (25), రెడ్డిగారి దినేష్ కుమార్ రెడ్డి (32), మొహమ్మద్ ఆరిఫ్ (24), బానోతు విద్యాసాగర్ (21), బానోతు కార్తిక్ (18) ఉన్నారు. చందు అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.







కామెంట్లు (0)