- ఈనెల 26న ఇందిరాపార్కు వద్ద ధర్నాను విజయవంతం చేయాలి
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్
నవతెలంగాణ - అశ్వారావుపేట
మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.42 వేలు చెల్లించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ పిలుపునిచ్చారు. శనివారం అశ్వారావుపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.
అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నా మున్సిపల్ కార్మికుల సమస్యల్లో ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని విమర్శించారు. కార్మిక సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వ్యతిరేకించకుండా వాటి అమలుకు నిబంధనలు రూపొందిస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 25, 26 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల కార్మికులను సమీకరించి ఇందిరాపార్కు వద్ద బహుళ రోజుల ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, కేటగిరీల వారీగా వేతనాలు పెంచాలని, మరణించిన లేదా అనారోగ్యంతో పని చేయలేని స్థితిలో ఉన్న కార్మికుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ధర్నాలో మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ మండల కన్వీనర్ కేసుపాక నరసింహారావు, ఏలేటి భూషణ్, శ్రీకాంత్, దుర్గమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)