Magazines

శాంతిభద్రతలు, నేరాల నియంత్రణకు పోలీసుల కృషి: ఎస్సై

2 గంటల క్రితం

Police's efforts
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - తొగుట 

శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తొగుట ఎస్ ఐ వి. నవీన్ అన్నారు. శనివారం తొగుట పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలు, పోలీసుల విధులు, బాధ్యతల గురించి విద్యార్థులకు ఎస్ఐ అవగాహన కల్పించారు.


పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్ విభాగం, సెక్షన్ ఇన్‌చార్జి, రైటర్ విధులు, రికార్డుల నిర్వహణ, బ్లూకోల్ట్స్ సిబ్బంది విధుల గురించి విద్యార్థుల క్లుప్తంగా వివరించారు. 100 డయల్ కాల్స్‌కు స్పందించే విధానం, ఎస్‌హెచ్‌ఓ విధులు, కోర్టు విధులకు సంబంధించిన ప్రక్రియలపై వివరించారు. లాకప్ నిర్వహణ, బీట్ ఫామ్‌లు తదితర అంశాలను ఎస్‌ఐ, సంబంధిత విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు విద్యార్థులకు వివరించారు.


ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, బాధితులకు న్యాయం అందించడం వంటి అంశాల్లో పోలీసులు నిర్వహించే కీలక పాత్రను విద్యార్థులకు సవివరంగా వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరు, పోలీసుల విధులు, బాధ్యతలపై అవగాహన కలగడంతో, భవిష్యత్తులో పోలీస్ శాఖలో చేరాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు మార్గదర్శకత్వం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్