Magazines

‎అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

1 గంట క్రితం

batukmma
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 2 నిమిషాల చదవడం

- ‎బీరంగూడలో మారుమోగిన మహిళల ఆటపాటలు
- ‎ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సింగర్ మధుప్రియ పాటలు
- ‎వేడుకలను ఘనంగా నిర్వహించిన మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ దంపతులు
‎నవతెలంగాణ - అమీన్‌పూర్ : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం బీరంగూడ డివిజన్‌ పరిధిలోని జయలక్ష్మి నగర్ కాలనీ సాయి స్కూల్ ఆవరణలో సద్దుల బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా, కోలాహలంగా సాగాయి. అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు ప్రముఖ సినీ, జానపద గాయని మధుప్రియ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుప్రియ ఆలపించిన బతుకమ్మ, జానపద గీతాలతో కాలనీ ప్రాంగణమంతా మార్మోగింది. మహిళలు, యువతులు, చిన్నారులు రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను నడుమ ఉంచి లయబద్ధంగా చప్పట్లు కొడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా సందడి చేశారు. ఈ వేడుకల్లో నందారం నరసింహ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను ఆడబిడ్డలందరూ కలిసికట్టుగా జరుపుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన పండుగలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని తెలిపారు. సింగర్ మధుప్రియ విచ్చేసి స్థానిక ఆడబిడ్డల్లో మరింత ఉత్సాహం నింపడం ఆనందంగా ఉందన్నారు. కాలనీవాసుల ఐక్యతతోనే ఈ వేడుకలు ఘన విజయం సాధించాయని పేర్కొన్నారు. అనంతరం గాయని మధుప్రియ మాట్లాడుతూ.. గతంలో వినాయక నిమజ్జనానికి ఇక్కడికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, పవిత్రమైన సద్దుల బతుకమ్మ వేడుకలకు తనను ఆహ్వానించిన నందారం నరసింహ గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆత్మీయత మధ్య బతుకమ్మ ఆడటం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. తమ కాలనీలో ఇంత ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించినందుకు స్థానిక మహిళలు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. నందారం నరసింహ గౌడ్ దంపతుల కుటుంబంపై గౌరమ్మ, దుర్గామాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

Madu Priya

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్