రైతాంగ పోరాటాల గడ్డ నల్లగొండలో నవంబర్ 15న లక్ష మంది రైతులతో భారీ బహిరంగ సభ
మహాసభల విజయవంతం కోసం ఆలేరులో సీపీఎం బైక్ ర్యాలీ
నవతెలంగాణ-ఆలేరురూరల్
అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఆలేరు మండల కేంద్రంలో శుక్రవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ దుర్గమ్మ గుడి, బస్టాండ్ మీదుగా గేట్ వరకు సాగి,అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ముగిసింది. అక్కడ నిర్వహించిన సభలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దూపటి వెంకటేశ్ మాట్లాడారు.
నవంబర్ 15 నుంచి 18 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల పురిటిగడ్డ నల్లగొండలో ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలు జరగనున్నాయని తెలిపారు. నవంబర్ 14 నుంచి 18 వరకు వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను ప్రతిబింబించేలా 'అగ్రి షో' వ్యవసాయ ప్రదర్శన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నవంబర్ 15న లక్ష మంది రైతులతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు, పేదలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పత్తి,వంట నూనెల దిగుమతులపై సుంకాలను పునరుద్ధరించాలని, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని పేర్కొన్నారు. దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన రైతు ఉద్యమ నాయకులు ఈ మహాసభల్లో పాల్గొని రైతాంగ సమస్యలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సూదగాని సత్యరాజయ్య, నల్లమాస తులసయ్య, పిక్క గణేష్, సంగీరాజు, చౌడబోయిన యాదగిరి,పాక్స్ డైరెక్టర్ బొమ్మకంటి లక్ష్మీనారాయణ, మిట్ట శంకరయ్య, పొన్నాల లక్ష్మయ్య, కొండం సుధాకర్ రెడ్డి, కాల్వ శ్రీనివాస్ రెడ్డి, గ్యార భాస్కర్, మధ్యబోయిన ఉప్పలయ్య, నిడిగొండ వాలి, బ్రహ్మచారి, దండు ఐలయ్య, ఎరుకల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)