- సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ
నవతెలంగాణ-సత్తుపల్లి
దేశవ్యాప్త పిలుపులో భాగంగా డిసెంబర్ 2న కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే 'జైలు భరో' కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ పిలుపునిచ్చారు. సత్తుపల్లి జేవీఆర్-ఓసీలో జరిగిన సీపీఐ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగబద్ధ సంస్థలను తమ గుప్పెట్లోకి తీసుకుని, ప్రజల ఓటు హక్కును సైతం హరించేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని రద్దు చేసి ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, పేదలకు 14 రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా అందించాలని దండు ఆదినారాయణ కోరారు.
కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 2న కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే జైలు భరో కార్యక్రమానికి వేలాదిగా కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి సముద్రాల సుధాకర్, ఏఐటీయూసీ నాయకులు జి. నరసింహారావు, బొగ్గు సుధాకర్, చారి, జయరాజు, చక్రవర్తి, రాంబాబు, శేఖర్, బద్రు, శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, రాజేష్ పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)