నవతెలంగాణ - అశ్వరావుపేట
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తిని సాదాసీదా వ్యక్తి అనుకుంటే పప్పులో కాలేసినట్టే! సాధారణంగా గన్మెన్లు, అధికారులు, అభిమానులు, ఆప్తుల నడుమ కనిపించే రాజకీయ ప్రముఖుడు ఈయన. కానీ ఇక్కడ మాత్రం ఓ అభిమాని ద్విచక్ర వాహనంపై సాధారణ వ్యక్తిలా ప్రయాణిస్తూ కనిపిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, మురసు తుఫాన్ ప్రభావంతో దమ్మపేట మండలంలో జరిగిన నష్టాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం స్వయంగా పరిశీలించారు.అధికారుల కాన్వాయ్లు, హడావుడి లేకుండా ఓ అభిమాని ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ వివిధ ప్రాంతాలను సందర్శించడం విశేషంగా నిలిచింది. భారీ వర్షాల కారణంగా మండలంలోని పలు రహదారులు దెబ్బతినడంతో పాటు వరి పంటలకు కూడా నష్టం వాటిల్లింది.
ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు మంత్రి తుమ్మల ద్విచక్ర వాహనంపై తిరుగుతూ నష్టాన్ని పరిశీలించినట్లు తెలిసింది. తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టంపై అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించనున్న నేపథ్యంలో, మంత్రి స్వయంగా క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గన్మెన్లు, అధికారుల హడావుడి మధ్యే కాదు.. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి అవసరమైతే సాధారణ వ్యక్తిలా ద్విచక్ర వాహనంపైనా వెళ్లగల నాయకుడినని మంత్రి తుమ్మల మరోసారి చాటిచెప్పారు.







కామెంట్లు (0)