Magazines

అన్నదాతను నట్టేట ముంచిన 'మురసు'

43 నిమిషాల క్రితం

Murasu
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 07, 2026 | 2 నిమిషాల చదవడం

- నీట మునిగి మొలకెత్తిన వరి కంకులు

- వరద ఉధృతికి ఇసుక మేటలతో దెబ్బతిన్న వరి పొలాలు

- ​సర్వే ప్రారంభించని వ్యవసాయ శాఖ అధికారులు

- దిక్కుతోచని స్థితిలో రైతన్నలు

నవతెలంగాణ-సత్తుపల్లి 

సత్తుపల్లి నియోజకవర్గంలో ఇటీవల సంభవించిన మురసు తుఫాను వరదలు అన్నదాతలను నిలువునా ముంచేశాయి. చేతికి వచ్చే దశలో ఉన్న వరి పంట నీట మునిగిపోవడంతో పాటు, వరద ఉధృతికి కంకులు సైతం మొలకెత్తడం రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. ఒకవైపు పంట నష్టం జరిగి తీవ్రంగా నష్టపోతే, మరోవైపు పొలాల్లో భారీగా ఇసుక మేటలు పేరుకుపోయాయి. ఈ పరిస్థితి ఎక్కువగా సత్తుపల్లి మండలంలోని సత్యనారాయణపురం గ్రామంలో ఉంది. మూలిగే నక్కపై తాటి పండు పడిన చందాన రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.


ఎక్కువగా పంట నష్టం జరిగిన మండలాల్లో పెనుబల్లి ఎక్కువగా ఉంది. ఆ తరువాత మండలాల్లో  తల్లాడ, కల్లూరు ఉంది. ఈ మూడు మండలాల్లో పంట నష్టం 5 వేల ఎకరాల నుంచి మొదలుకొని 2వేల వరకు జరిగినట్లు అంచనా. సత్తుపల్లి, వేంసూరు మండలాల విషయానికొస్తే సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో పంట నష్టం స్వల్పంగా జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. 

వ్యవసాయ శాఖ పంట నష్టంపై ప్రాథమిక అంచనా: వ్యవసాయ శాఖ పంట నష్టంపై ప్రాథమిక అంచనా ప్రకారం వ్యవసాయ శాఖ తెలిపిన విధంగా పెనుబల్లి  మండలంలో 5255 ఎకరాల్లో పంట నష్టం జరగ్గా  తల్లాడ మండలంలో 5200 ఎకరాలు, కల్లూరు మండలంలో 2024 ఎకరాల్లో పంట నష్టం వాటిలినట్లు ప్రాథమిక అంచనా. సత్తుపల్లి మండలంలో 496 ఎకరాలు, వేంసూరు మండలంలో 650 ఎకరాల్లో పంట నష్టం ఉండొచ్చని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.


ప్రారంభం కాని పంట నష్ట సర్వే: మురస తుఫాను ప్రభావం తగ్గి మూడు రోజులు కావస్తున్నా ఇంతవరకు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టానికి సంబంధించి సర్వే కార్యక్రమాలను ప్రారంభించకపోవడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో వరి చేలు ఇంకా నీట మునిగే ఉండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


రైతు భరోసా ఆన్ లైన్ మోడ్యూల్ లో ఓపెన్ కానీ డాట్ సర్వే కాలమ్: ఇదిలా ఉంటే  రైతు భరోసా ఆన్ లైన్ లో క్రాఫ్ డామేజ్ మోడ్యూల్ డ్రాట్ సర్వే కాలమ్ లో ఇంతకుముందు ఉన్న తుఫానులు వచ్చిన సమయంలో డ్రాట్ సర్వే కాలమ్ సైట్ ఓపెన్ అయ్యేదని ప్రస్తుతం మురసు తుఫాను కు సంబంధించి సైట్ ఓపెన్ కావడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని కోరుతున్నారు.

10 ఎకరాల్లో వరి పంట చేశా.. భారీ నష్టం జరిగింది : చిన్నంశెట్టి మాధవరావు, రైతు, సత్యనారాయణపురం 

అప్పు చేసి మరీ 10 ఎకరాల్లో వరి పంటను సాగు చేశాను. మొన్న వచ్చిన తుఫానుతో చాలావరకు పంట నష్టం జరిగింది. కంకులు నీటిలో మునిగి ఉండటం వల్ల మొలకలు కూడా వచ్చాయి. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను. 

రెండు ఎకరాల్లో వరివేసాను.. ఎకరానికి పైగా దెబ్బతింది: కర్నాటి బసవయ్య రైతు, సత్యనారాయణపురం 

తాను రెండు ఎకరాల్లో వరి పంటను వేశాను. ఆ వేసిన పంటలో ఎకరానికి పైగా వరి పంటను మురసు తుఫాను మింగేసింది. ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలి 

పంట నష్టంపై సర్వే ప్రారంభిస్తాం : వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏడీఏ, సత్తుపల్లి 

 మురసు తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట చేలను సర్వే చేయమని ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. రైతు భరోసా ఆన్లైన్  క్రాఫ్ డామేజ్ మోడ్యుల్ లో డ్రాట్ సర్వే కాలం ఓపెన్ కాకపోవడం కారణంగా సర్వేకు ఆటంకం ఏర్పడింది. ఆదివారం నుంచి పంట నష్టంపై సర్వే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్