- ప్రజల మన్ననలు అగ్రస్థానంలో నిలిపింది
- ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నా పనితనం
- వచ్చే సంక్రాంతి నాటికి సత్తుపల్లికి గోదావరి జలాలు
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ-సత్తుపల్లి : సత్తుపల్లి గడ్డపై నా రాజకీయ ప్రయాణం ప్రజల మన్ననలతోనే నన్ను అగ్రస్థానంలో నిలిపిందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సోమవారం సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో మంత్రి తుమ్మల ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నా పనితనం ఉంటుందన్నారు.వచ్చే సంక్రాంతి నాటికి సత్తుపల్లికి గోదావరి జలాలు వస్తాయని చెప్పారు. రాజకీయాల్లో ఎలాంటి మార్పులొచ్చినా, ప్రజల మనస్సులో ఉన్నట్లుగానే పనిచేశానని, ఎక్కడా తప్పు చేయకుండా ప్రజల మన్ననలతో ముందుకు సాగానని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
టీడీపీతో ప్రత్యేక అనుబంధం... ఎన్టీఆర్ ఆశీస్సులు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర విభజన వరకు ప్రతి సంక్లిష్ట సమయంలోనూ పార్టీని ముందుండి నడిపించానన్నారు. 29 ఏళ్ల వయసులోనే సత్తుపల్లి ప్రజలు తనను భుజాలపై ఎత్తుకుని గెలిపించారని గుర్తుచేసుకున్నారు.
అడగకుండానే దక్కిన పదవులు
అడగకుండానే దేవుడి దయ వల్ల పార్టీ టికెట్లు, మంత్రి పదవులు దక్కాయని, ఇదంతా ప్రజల మద్దతు తనను నిలబెట్టిందని తెలిపారు. సత్తుపల్లికి మొదటి ప్రాధాన్యత, అభివృద్ధి పనులు, ఏ శాఖలో ఉన్నా రాజకీయ జన్మనిచ్చిన సత్తుపల్లికే తన ప్రథమ ప్రాధాన్యమని, ఆగిపోయిన ఫుడ్ పార్క్, పామాయిల్ ఫ్యాక్టరీ, టూరిజం ప్రాజెక్టులతో పాటు గోదావరి జలాలను తెచ్చి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, డీసీసీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, ఏఎంసీ చైర్మన్ చల్లగుళ్ల నరసింహారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, నాయకులు మొహమ్మద్ కమల్ పాషా, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, రాష్ట్ర మార్కెటింగ్ డైరెక్టర్ రాహుల్ పాల్గొన్నారు.
పట్టణంలో కాంగ్రెస్ శ్రేణుల భారీ మోటార్ సైకిల్ ర్యాలీ
సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా చల్లగుళ్ల నరసింహారావు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్ పాల్గొన్నారు. ఈ ర్యాలీ పట్టణ శివారులోని హరి హరాత్మజ ఆలయం నుంచి ప్రధాన రహదారి మీదుగా వెంగళరావు నగర్ లోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణ వరకు సాగింది.







కామెంట్లు (0)