Magazines

మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠాన్ని"మాల"సామాజిక వర్గానికి కేటాయించాలి

2 గంటల క్రితం

chairmanship
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-తుంగతుర్తి
తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠాన్ని"మాల"సామాజిక వర్గానికి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్దిరాల మండల పరిధిలోని జి.కొత్తపల్లి గ్రామ వాస్తవ్యులు బొబ్బిలి వెంకన్న అన్నారు. నామినేటెడ్ పదవుల్లో మాల సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి రాజకీయ వర్గాల్లో, దళిత సంఘాల్లో విస్తృతంగా వ్యక్తమవుతోందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ, నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల నియామకాల విషయంలో మాలలకు ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


స్థానిక ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షులు, వివిధ మండలాల మండల పార్టీ అధ్యక్షులు, గత మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, డైరెక్టర్లు అందరూ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారేనని, అందుకే తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠాన్ని మాల సామాజిక వర్గానికి కేటాయించినట్లయితే, సామాజిక వర్గాల మధ్య సమతుల్యం సరిపోతుందనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకు వచ్చానని అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా తన సేవలను గుర్తించి స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు తనకు అవకాశం కల్పిస్తారని బొబ్బిలి వెంకన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


1995 నుండి కాంగ్రెస్ జెండాను విడవకుండా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నానని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేశానని పేర్కొన్నారు. 1995, 2001లో వార్డు మెంబర్ గా గెలుపొందానని, 2006 లో వార్డ్ మెంబర్ గా గెలుపొంది ఉప సర్పంచ్ గా పని చేశానని తెలిపారు. 2014 లో మామిండ్లమడవ ఎంపీటీసీగా గెలుపొందానని, 2019 లో తన తల్లిని సర్పంచిగా గెలిపించానని గుర్తు చేశారు. తాను ఎంపీటీసీగా, తన తల్లి సర్పంచిగా పనిచేసిన సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ప్రలోభాలకు గురి చేసినప్పటికీ పార్టీ మారలేదని గుర్తు చేశారు.

ఉమ్మడి జిల్లాలో నూతనకల్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా, సూర్యాపేట జిల్లా ఏర్పాటు తర్వాత 10సం.లు మద్దిరాల మండలం ఎస్సీ విభాగం అధ్యక్షులుగా, 6 సంవత్సరాలు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా పని చేశానని తెలిపారు. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశానన్నారు. వర్గీకరణ పేరుతో రాజకీయ కారణాల వల్ల నామినేటెడ్ పదవుల పంపిణీలో సమతుల్యత దెబ్బతింటుందని దీనివల్ల మాలలు వెనుకబడిపోతున్నారనేది జగమెరిగిన సత్యం అన్నారు.


పార్టీలో దీర్ఘకాలికంగా పనిచేసే వారిని పక్కన పెట్టి మెరుపుతీగల్లా ప్రత్యక్షమయ్యే వారికే పదవులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు ఇటీవల కాంగ్రెస్ లో వ్యక్తం కావడంతో పాటు పార్టీ నాయకుల్లో తీవ్రమైన అసంతృప్తి జ్వాలలు అలుముకుంటున్నాయి అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు కేటాయించి తగిన న్యాయం చేయాలని కోరారు. తన రాజకీయ ప్రస్థానం, పార్టీ పట్ల చూపిన విధేయత, ప్రతికూల పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ జెండాను విడవకుండా చేసిన సేవలను గుర్తించి స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు తనకు తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నట్లు బొబ్బిలి వెంకన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్