నవతెలంగాణ-ఆలేరు రూరల్
పంటలు పండించి ప్రజలకు అన్నం పెట్టాల్సిన రైతన్నకు మురుగునీటి కష్టాలు తప్పడం లేదు. రాజకీయాలు, ఆధిపత్య పోరుతో తమ పొలాల్లోకి మురుగునీరు చేరుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో మురుగునీటి కాలువకు అడ్డుకట్ట వేయడంతో సమీపంలోని సుమారు ఏడుగురు రైతుల పంట పొలాల్లోకి మురుగు నీరు చేరుతోంది.
గతంలో కాలువ ద్వారా మురుగునీరు వాగులోకి వెళ్లేదని, అడ్డుకట్ట వేయడంతో నీరు నిలిచిపోయి పంటలు దెబ్బతింటున్నాయని రైతులు చెబుతున్నారు. సమస్యను పరిష్కరించాలని రైతు బీమగోని సంతోష్ గౌడ్ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో, తన సొంత ఖర్చులతో కాలువలోని అడ్డంకి నుంచి వాగు వరకు మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దీంతో కొంతకాలం సమస్య తొలగినా, ఇటీవల మళ్లీ కాలువకు అడ్డుకట్ట వేయడంతో పరిస్థితి మొదటికొచ్చిందని రైతులు వాపోతున్నారు.
అధికారులు స్పందించకపోతే కలెక్టరేట్ ఎదుట ధర్నా!
మురుగునీరు పొలాల్లోకి చేరడంతో పంటలు దెబ్బతింటున్నాయని, తమకు నష్టం జరుగుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కాలువకు అడ్డంకిని తొలగించి, మురుగునీరు వాగులోకి వెళ్లేలా శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. రైతుల పంటలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కాలువకు అడ్డుకట్ట వేయడానికి గల కారణాలను పరిశీలించి, రైతులకు నష్టం కలగకుండా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.





కామెంట్లు (0)