- 30 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
- ఆయిల్‌ఫెడ్ ఏర్పాటు తర్వాత మూడోసారి నియామకాలు
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రైతుల కృతజ్ఞతలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ కోఆపరేటివ్ ఆయిల్‌సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ (టీజీ ఆయిల్‌ఫెడ్)లో ఉద్యోగ నియామకాలకు ఎట్టకేలకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఆయిల్‌ఫెడ్ ఏర్పాటు అనంతరం ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇది మూడోసారి. సంస్థలో వివిధ విభాగాలకు సంబంధించి 30 పోస్టులను అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. 2026 అక్టోబర్ 31న జారీ చేసిన జీఓ ఆర్టీ నంబర్ 1712 ద్వారా ఈ అనుమతులు కల్పించింది.
ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం డిప్యూటీ మేనేజర్ (ఎం.టెక్) ఒక పోస్టు, డిప్యూటీ మేనేజర్ (అగ్రి) రెండు పోస్టులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (మెకానికల్) ఆరు పోస్టులు, కెమిస్ట్ ఒక పోస్టు, ఎగ్జిక్యూటివ్ (జనరల్) నాలుగు పోస్టులు, జూనియర్ ఆపరేటర్ నాలుగు పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ తొమ్మిది పోస్టులు, ఫీల్డ్ ఆఫీసర్ మూడు పోస్టులు కలిపి మొత్తం 30 పోస్టులకు అనుమతి ఇచ్చింది.
పోస్టుల వారీగా నెలవారీ వేతనాలను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రూ.45 వేలు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు రూ.43 వేలు, కెమిస్ట్‌కు రూ.42 వేలు, ఎగ్జిక్యూటివ్‌కు రూ.43 వేలు, జూనియర్ ఆపరేటర్‌కు రూ.31 వేలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.24 వేలు, ఫీల్డ్ ఆఫీసర్‌కు రూ.25 వేల చొప్పున నెలవారీ వేతనం చెల్లించనున్నారు.
అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియామక ప్రక్రియ చేపట్టాలని, ఎంపికకు సంబంధించిన నిబంధనలు పాటించాలని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నియామకాలకు అయ్యే వ్యయాన్ని ఆయిల్‌ఫెడ్ సొంత నిధుల నుంచే భరించాల్సి ఉంటుంది. 2027 మార్చి 31 వరకు లేదా రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకు, అవసరం ముగిసే వరకు ఈ అనుమతి అమల్లో ఉంటుందని పేర్కొంది. ఆయిల్‌పామ్ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో సంస్థలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు 30 పోస్టుల భర్తీకి అనుమతి లభించడం శుభపరిణామమని పామాయిల్ రైతులు మద్దినేని వెంకట్, బండి భాస్కర్ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల విషయంలో ప్రత్యేక చొరవ చూపిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అయితే పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఎంపిక ప్రక్రియను త్వరితగతిన ప్రారంభించి అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని వారు కోరారు.







కామెంట్‌లు (0)