Magazines

వ్యవసాయ ఉత్పత్తులపై ధరల నియంత్రణ సమంజసం కాదు 

18 నిమిషాల క్రితం

Price controls
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

- ఏఐయూకేఎస్ జిల్లా కార్యదర్శి కోలేటి నాగేశ్వరరావు 

నవతెలంగాణ-సత్తుపల్లి 

వ్యవసాయ ఉత్పత్తులపై ధరలు నియంత్రణ సమంజసం కాదని, దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) జిల్లా కార్యదర్శి కోలేటి నాగేశ్వరరావు అన్నారు. తక్షణమే ధరల నియంత్రణ చర్యలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.‌ సత్తుపల్లిలోని నీలం రామచంద్రయ్య భవనంలో ఏఐయూకేఎస్ కల్లూరు డివిజన్ అధ్యక్షులు ఒగ్గు నాగిరెడ్డి అధ్యక్షతన డివిజన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ... ఎల్ నినో ప్రభావంతో ఖరీఫ్ దిగుబడులు గణనీయంగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రభుత్వ విధానాల వల్ల బియ్యం ధరలను నియంత్రించడంతో రూ. 4వేలకు కొనాల్సిన క్వింటా వడ్లను మిల్లర్లు మద్దతు ధరకు కూడా కొనడం లేదని, దీంతో శ్రమకోర్చి పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. 

సమావేశంలో పలు కీలక తీర్మానాలు

​ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, రబీ సీజన్‌కు ఆరుతడి విత్తనాలు ఉచితంగా అందించి కొత్త రుణాలు మంజూరు చేయాలని కోరారు. రుణాలపై మారటోరియం కాకుండా సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. హామీ ఇచ్చిన ప్రకారం రైతు భరోసా, కూలీలకు రూ. 12 వేలు  అందించాలన్నారు. ఉపాధి హామీ పనిదినాలు 200 రోజులకు, కూలీ రూ. 700కు పెంచాలని కోరారు.


పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేల పరిహారం చెల్లించాలని తీర్మానించారు. ఈ డిమాండ్ల సాధనకు డిసెంబర్ నెలంతా విస్తృత ప్రచారం నిర్వహించి, డిసెంబర్ 29న హైదరాబాద్‌లో నిర్వహించే 'ప్రజా గర్జన' ప్రదర్శనలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి బీరెల్లి లాజర్, బొజ్జ విశ్వనాధం, నరుమాళ్ల మంగయ్య పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్