ప్రథమ చికిత్సతో రోగులకు భరోసా కల్పిస్తారు
ఆర్ఎంపీ డాక్టర్స్ సంఘం అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి
నవతెలంగాణ-అచ్చంపేట
గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు అత్యవసర సమయంలో ప్రాథమిక వైద్యం అందించి పల్లె ప్రజల ప్రాణాలకు ఆర్ఎంపీ డాక్టర్లు జీవం పోస్తున్నారని, ఆర్ఎంపీ డాక్టర్స్ సంఘం అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ.. ఆర్ఎంపీ డాక్టర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవస్థల గురించి వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఆసుపత్రులు, నిపుణులైన వైద్యులు అందుబాటులో లేని పల్లెల్లో ఆర్.ఎం.పీ (రూరల్ మెడికల్ ప్రాక్టీషన్ ) ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉంటూ.. పల్లె ప్రజలకు కుటుంబ సభ్యులుగా కలిసిపోయి ధైర్యం చెప్పడం నమ్మకమైన వెంటనే అవసరమైన ప్రాథమిక చికిత్స అందిస్తూ.. ప్రాణాలలో కాపాడడంలో ప్రధానంగా కృషి చేస్తున్నారని తెలిపారు.
పట్టణాలకు వెళ్లి పెద్ద ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రోగులను సకాలంలో పట్టణాల్లోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లమని సలహాలు, సూచనలు ఇస్తున్నారని గుర్తు చేశారు. చిన్నపాటి గాయాలకు కట్లు కట్టడం , జ్వరం , నొప్పులకు ప్రథమ చికిత్స సేవలకు మాత్రమే అందిస్తున్నారు.
ఆర్ఎంపీ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ వైద్యులకు గుర్తింపు కల్పించి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం అందించేందుకు అవసరమైన సర్టిఫికెట్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మారుమూల గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ అత్యవసర సమయాల్లో ప్రథమ చికిత్స అందిస్తున్న గ్రామీణ వైద్యుల సేవలను ప్రభుత్వం గుర్తించాలన్నారు. గ్రామీణ వైద్యులు వైద్యం చేయకూడదంటూ... ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆర్.ఎం.పి వైద్య కేంద్రాల వద్ద తనిఖీలు నిర్వహించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులో లేని సందర్భాల్లో ప్రజలకు ప్రాథమిక చికిత్స అందిస్తున్న గ్రామీణ వైద్యులపై వేధింపులు, దాడులు నిలిపివేయాలని, ఆర్ఎంపీ డాక్టర్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.







కామెంట్లు (0)