అఖిల భారత కిసాన్ మహాసభలు జయప్రదం చేయండి
రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేశా నాయక్
నవతెలంగాణ-అచ్చంపేట
నాగర్ కర్నూల్ జిల్లాలో 20 మండలాలకు ప్రభుత్వం 13 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేశ్యానాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లింగాల మండలం రాయవరం గ్రామంలో శుక్రవారం అఖిల భారత కిసాన్ మహాసభలను జయప్రదం చేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ్యానాయక్ మాట్లాడారు.
ఈనెల 15 నుండి 18 వరకు నల్గొండలో జరిగే రైతు సంఘం జాతీయ మహాసభలకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వము రైతులను దివాలా తీసే విధంగా తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని హెచ్చరించారు. 15వ తేదీన భారీ బహిరంగ సభ లక్షలాదిమందితో ఉంటుందన్నారు. రాష్ట్రంలో 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారని, నాగర్ కర్నూలు జిల్లాలో 20 మండలాలకు గాను 13 మండలాలు కరువు జిల్లాలుగా ప్రకటించారు.
మిగతా మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రకటించిన కరువు మండలంలో ఆహార పంటలకు రూ.25వేల చొప్పున ఎకరాకు పరిహారం ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. కరువు మండలాలకు కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్ల నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అతివృష్టి అనావృష్టి వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించడానికి రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని వారు అన్నారు. సిసిఐ, ఐకెపి, పిఎసిఎస్ దాన్యం కొనుగోలు కేంద్రాలలో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని , రైతులు పండించే పండ్లు కూరగాయలు పత్తి, మిర్చి తదితర పంటలకు గిట్టుబాటు ధర లభించే విధంగా రైతాంగాన్ని చైతన్యం చేసి పోరాటం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి శంకర్ నాయక్, రైతు సంఘం నాయకులు స్వామి, దేవుడు, శ్రీను, భాగ్యమ్మ, లక్ష్మమ్మ, ఉన్నారు.







కామెంట్లు (0)