- పంచారామాలతో పాటు పలు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు
నవతెలంగాణ - పరకాల: కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పరకాల ఆర్టీసీ డిపో నుంచి పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ టీ. శ్రీనివాసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలైన అమరావతి, ద్రాక్షారామం, భీమవరం, పాలకొల్లు, సామర్లకోటకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణలోని రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, లక్నవరం సరస్సు, మేడారం సమ్మక్క–సారలమ్మ దేవాలయం, మల్లూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, బొగత జలపాతం, కాళేశ్వరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాలకు కూడా ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
అలాగే హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీ, సాలార్‌జంగ్ మ్యూజియం, గోల్కొండ కోటతో పాటు తమిళనాడులోని అరుణాచలానికి కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శబరిమలై యాత్రకు సైతం భక్తుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు, బస్సుల బుకింగ్ కోసం 99592 26051, 96669 19190, 76740 08703 నంబర్లను సంప్రదించాలని డిపో మేనేజర్ టీ. శ్రీనివాసులు సూచించారు.






కామెంట్‌లు (0)