- 40 రోజులుగా ధాన్యం కొనుగోళ్ల కోసం రైతుల ఎదురుచూపులు
నవతెలంగాణ – తుంగతుర్తి: ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. పంట సాగు నుంచి విక్రయించే వరకు అడుగడుగునా సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకవైపు పెట్టుబడి ఖర్చులు పెరుగుతుండగా, మరోవైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో జాప్యం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కూలీలు, గన్నీ బ్యాగులు, లారీల కొరతతో పాటు తేమ శాతం కొలిచే యంత్రాలు అందుబాటులో లేకపోవడం, సకాలంలో తూకం వేయకపోవడం వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు సుమారు 40 రోజులుగా కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దీంతో దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు ధాన్యం విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, సాగునీటి కొరత, కరువు, అకాల వర్షాలు రైతులను మరింత నష్టాల్లోకి నెడుతున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలతో పాటు ట్రాక్టర్లు, కూలీల ఖర్చులు పెరిగిపోయాయి. పంటకు ముందు పెట్టుబడి సాయం, పంట చేతికొచ్చిన తర్వాత గిట్టుబాటు ధర కల్పించాలన్నదే రైతుల ప్రధాన డిమాండ్. అయితే క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది.
రెండు ఎకరాల్లో ఎండిన వరి పంట
మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన రైతు ఉప్పుల కొమరమల్లు తనకున్న ఐదు ఎకరాల్లో వరి సాగు చేశారు. కాలువల ద్వారా సాగునీరు అందకపోవడం, విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రెండు ఎకరాల వరి పంట ఎండిపోయిందని తెలిపారు. మిగిలిన పంట చేతికొచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చేందుకు మిల్లర్లను ఆశ్రయించి ధాన్యం విక్రయించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: బుర్ర శ్రీనివాస్
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పంట కోసి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం విచారకరమన్నారు. ధాన్యం కుప్పల వద్ద రైతులు పడిగాపులు కాస్తుండటంతో దళారుల బెడద పెరిగి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.







కామెంట్‌లు (0)