పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-మిడ్జిల్
మిడ్జిల్ మండల పరిధిలోని వాడియాల నుండి మసిగుల్లపల్లి వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారి, వాహనదారులకు నరకదర్శనం మిగులుస్తోంది. గత కొంతకాలంగా ఈ రోడ్డు అధ్వానంగా తయారైనా, జిల్లా అధికారులు మాత్రం కనీసం ముఖం చాటేసి చూస్తున్నారే తప్ప మరమ్మతులకు పూనుకోవడం లేదని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం నరకయాత్ర, భయాందోళనలో వాహనదారులు
ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహనదారులు, ప్రజలు వణికిపోతున్నారు. రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలు పడి, ఎటు చూసినా కంకర తేలి ప్రమాదకరంగా మారింది. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో ప్రతిరోజూ ఏదో ఒకచోట ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారు. రాత్రి వేళల్లో గుంతలు కనిపించక ప్రయాణం మరింత ప్రాణాంతకంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు ఈ రోడ్డుపై రావాలంటేనే నరక యాత్ర చూస్తున్నాం అని ప్రయాణికులు వాపోతున్నారు.
పట్టించుకోని జిల్లా అధికారులు
రోడ్డు పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా, జిల్లా ఉన్నతాధికారులు కానీ, సంబంధిత శాఖాధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని, కేవలం హామీలకే పరిమితమవుతున్నారని వాడియాల, వేముల, గిరిజన తండాలు, మసి గుండ్లపల్లి
గ్రామస్థులు అధికారుల తీరిపై మండిపడుతున్నారు.
జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలి
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఆర్అండ్‌బి అధికారులు స్పందించి, మిడ్జిల్ మండలంలోని వాడియాల - మసిగుల్లపల్లి బీటీ రోడ్డుకు తక్షణమే నిధులు మంజూరు చేసి, యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలని స్థానిక ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.
ప్రతిరోజూ ప్రమాదాలే: మంద భీమ్ రాజ్, బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మండల నాయకులు
ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సి వస్తోంది. రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. బైక్‌పై వెళ్తుంటే ఎప్పుడు ఎక్కడ పడిపోతామో తెలియని పరిస్థితి. గత వారమే ఇద్దరు యువకులు గుంతను తప్పించబోయి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు పెద్ద ప్రమాదం జరిగే వరకు ఎదురుచూస్తున్నారా మండిపడుతున్నారు.
గర్భిణులు, వృద్ధుల నరకయాత: సర్పంచ్ శ్రీశైలం యాదవ్ మసీగుండ్లపల్లి
మా ఊరి నుంచి అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలన్నా, ఆటోలు రావడానికి భయపడుతున్నాయి. ఒకవేళ వచ్చినా ఈ గుంతల రోడ్డుపై ప్రయాణించడం వల్ల గర్భిణులు, వృద్ధులు నరకయాతన అనుభవిస్తున్నారు. రోడ్డు బాగా లేదనే సాకుతో ఆర్టీసీ బస్సులు కూడా రావడం లేదు, పాఠశాలకు, కళాశాలకు వెళ్లే ఈ విద్యార్థులకు ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయని అధికారులకు ఆర్టీసీ సిబ్బందికి విన్నవించుకున్న ఫలితం లేకుండా పోతుంది, పాఠశాల సమయానికి బస్సులు నడపాలని కోరారు.
రాత్రి వేళల్లో ప్రయాణం ప్రాణాంతకం: బర్రె వెంకటయ్య సామాజిక కార్యకర్త
వాడియాల - మసిగుల్లపల్లి బీటీ రోడ్డు గుంట రాత్రి పూట ప్రయాణం చేయాలంటేనే భయమేస్తుంది. ఆయా గ్రామాలలో లైట్లు సరిగ్గా ఉండవు, దానికి తోడు గుంతల లోతు తెలియక వాహనాలు దెబ్బతింటున్నాయి. చాలామంది ఆటోలు తెచ్చుకుని నడిపిస్తున్నారు. సంపాదన అంతా ఆటో రిపేర్లకే సరిపోతోంది. ప్రజాప్రతినిధులు ఓట్ల కోసం రావడం తప్ప మా బాధలు పట్టించుకోవడం లేదు.
అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం
రోడ్డు పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా, జిల్లా ఉన్నతాధికారులు కానీ, సంబంధిత శాఖాధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వినతిపత్రాలు ఇచ్చి అలసిపోయామని, కేవలం హామీలకే పరిమితమవుతున్నారని గ్రామస్థులు మండిపడుతున్నారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, పంచాయతీ రాజ్ మరియు ఆర్అండ్‌బి అధికారులు స్పందించి, మిడ్జిల్ మండలంలోని వాడియాల - మసిగుల్లపల్లి బీటీ రోడ్డుకు తక్షణమే నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టాలని, యుద్ధప్రాతిపదికన కొత్త రోడ్డు నిర్మించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో వాడియాల, వేముల, మసిగుండ్లపల్లి, గిరిజన తండాల ప్రజలతో కలిసి రోడ్డుపైనే బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.






కామెంట్‌లు (0)