ప్రజలకు నాగోల్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ సూచనలు
నవతెలంగాణ–నాగోల్
దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నాగోల్ పోలీస్ స్టేషన్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టపాసులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, చిన్నారులు బాణసంచా కాల్చే సమయంలో తల్లిదండ్రులు దగ్గరుండి పర్యవేక్షించాలని కోరారు. పెట్రోల్ బంకులు, గ్యాస్ సిలిండర్లు, వాహనాల పార్కింగ్ ప్రాంతాల సమీపంలో టపాసులు కాల్చకూడదని, ముందస్తుగా నీటి బకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
పండుగకు స్వగ్రామాలకు వెళ్లేవారు ఇంటి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విలువైన ఆభరణాలను సురక్షితంగా భద్రపరచుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.







కామెంట్‌లు (0)