వర్షాభావంతో తగ్గిన దిగుబడులు
అప్పుల ఊబిలో సాగుదారులు
యాసంగి సాగూ కష్టమే
నవతెలంగాణ - మల్హర్ రావు
మండలంలోని 15 గ్రామపంచాయతీల్లో ఉన్న దాదాపు 1270 మంది కౌలు రైతులు ఈ ఏడాది ఎకరాకు రూ.15 వేల చొప్పున కౌలుకు తీసుకుని 8,600 వేల ఎకరాల్లో ఖరీఫ్ పత్తి,వరి,మిర్చి సాగు చేశారు.పంట దిగుబడి ఆశాజనకంగా లేకపోవడంతో రబీలో పంటల వేసైనా కౌలు డబ్బులు చెల్లించాలని అనుకున్నా ఎలినినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో ఎలినినో ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లోని కౌలురైతులపై తీవ్ర వినాశనాన్ని మిగిలి స్తోంది.రుతుపవనాలు ముఖంచాటేయడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి.
సొంత భూమి లేకపోయినా వేలాది రూపాయల కౌలు చెల్లించి పంటలు సాగు చేసిన కౌలురైతులు నిలువునా మునిగిపోయే పరిస్థితి కనిపిస్తోంది.ఖరీఫ్ లో సాగు చేసిన పంటల దిగుబడి ఆశాజనకంగా రాలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు యాసం గిలో కనీసం రెండో పంట వేసి నష్టాలను కొంత మేరకు తగ్గించుకోవచ్చనుకున్న వారి ఆశలు ఆవిరయ్యాయి.నీటి సంక్షోభం కారణంగా యాసంగిలో మొక్కజొన్న,బబ్బర పంటలు వేసే అవకాశం లేక అన్నదాతలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు.
అప్పుల ఊబిలోకి నెట్టిన సాగు ఖర్చులు
పత్తి,వరి, మిర్చి వంటి పంటలను నమ్ముకున్న కౌలు రైతులకు వర్షాభావ పరిస్థితులు కోలుకోలేని దెబ్బ తీశాయి.ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు చెల్లించి భూములను కౌలుకు తీసుకున్న రైతులు,విత్తనాలు, ఎరువులు,కూలీల ఖర్చుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారు.ఎండలు, నీటి కొరత వల్ల దిగుబడులు కనీస పెట్టుబడిని కూడా పూడ్చే స్థితిలో లేవు. పంటలు చేతికి రాకపోగా, భూ యజమానులకు కౌలు సొమ్ము ఎలా చెల్లించాలో పాలుపోక కౌలు కుటుంబాలు ఆందోళనలో మునిగిపోయాయి.
పథకాలకు నోచుకోని వాస్తవ సాగుదారులు..
భూ యజమాని పేరిట కాకుండా నేలను నమ్ముకున్న వాస్తవ సాగుదారునికి గుర్తింపు కార్డులు లేక పోవడంతో ప్రభుత్వ 'రైతు భరోసా' పెట్టుబడి సాయం కౌలు రైతులకు అందడంలేదు. ఎల్సినో వల్ల పంట నష్టపోయినప్పటికీ ప్రభుత్వ సర్వేల్లో,పరిహార జాబితాల్లో కౌలు రైతుల పేర్లు నమోదు కావడం లేదు.ప్రాజెక్టులు, చెరువులు, బోరుబావుల్లో నీరు లేకపోవడంతో యాసంగిలో మొక్కజొన్న,జొన్న పంటలు వేయవద్దని ప్రభుత్వం సూచిస్తోం ది. దీంతో రెండో పంట ద్వారా నష్టాలను భర్తీ చేసు కునే ఆశ కూడా గల్లంతయింది.
రుణ అర్హత కార్డులు ఇవ్వాలి
ఈ గడ్డు పరిస్థితుల నుంచి కౌలు రైతు లను రక్షించడానికి ప్రభుత్వం వెంటనే 2011 వాస్తవ సాగు దారుల చట్టాన్ని అమలు చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు.కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందజేయాలని,రెవెన్యూ,వ్యవసాయ అధికారులు క్షేత్ర పరిశీలన జరిపి, పహానిలోని 16వ కాలంలో వాస్తవ సాగుదారుగా కౌలు రైతు పేరును చేర్చాలని కోరుతున్నారు.







కామెంట్లు (0)