రెండు రోజుల్లో చెల్లించకపోతే కార్మిక శాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తాం: ఏఐటీయూసీ యూనియన్ నేతలు
నవతెలంగాణ – నాచారం
నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది. శుక్రవారం ఆస్పత్రి ఎదుట కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. జీతాలు అందేవరకు సమ్మెను విరమించేది లేదని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు నెలలుగా జీతాలు అందక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. రెండు రోజులుగా కార్మికులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. జీతాలు లేక ఇంటి అద్దెలు చెల్లించలేక, పిల్లల ఫీజులు కట్టలేక, కుటుంబ పోషణ భారంగా మారి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమ్మెకు దిగితే తప్ప జీతాలు చెల్లించని పరిస్థితి నెలకొనడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. జీతాల చెల్లింపునకు సంబంధించిన ఫైల్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామని అధికారులు చెబుతున్నారని, అయితే కార్మికుల ఖాతాల్లో జీతాలు ఎప్పుడు జమ చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తక్షణమే జోక్యం చేసుకుని పెండింగ్ వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.కార్మికులకు సకాలంలో వేతనాలు అందకపోతే సంబంధిత అధికారులకు మెమోలు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారని, ఈఎస్ఐ ఆస్పత్రి కార్మికుల విషయంలో ఆ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మరో రెండు రోజుల్లో జీతాలు చెల్లించకపోతే కార్మిక శాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. జీతాలు అందేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ ధర్నాలో యూనియన్ నాయకులు క్రాంతి, భాస్కరాచారి, నర్సింగ్ రావు, వేణుమాధవ్, నీలిమ, రేణుక, రాజేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)