Magazines

మురసు ముసురుతో నల్లబడ్డ తెల్లబంగారం

31 నిమిషాల క్రితం

Murasu Tuffan
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 07, 2026 | 2 నిమిషాల చదవడం

- మొగ్గ తొడిగిన పత్తి.. 

- నానిన మినుము

- చేతికందినా నోటికందని పంట.. 

- అప్పుల ఊబిలో రైతులు

నష్టపరిహారం అందించాలని రైతు సంఘం నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య డిమాండ్

నవతెలంగాణ – అశ్వారావుపేట

చిన్న, సన్నకారు రైతులు అప్పు చేసో, వడ్డీకి డబ్బులు తెచ్చో పంటలు సాగు చేస్తుంటారు. పంట చేతికొచ్చే సమయంలో అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతుండటంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తాజాగా మురసు తుఫాన్ ప్రభావంతో కురిసిన ఎడతెరిపిలేని భారీ వర్షాలు పలు పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి.


అక్టోబర్ వరకు ఎల్‌నినో ప్రభావంతో సతమతమైన రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేశారు. పలు పంటలు వివిధ దశల్లో ఉండగా, ఇంతలో మురసు తుఫాన్ ముసురుతో మూడు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో చేతికొచ్చిన పంటలు కూడా రైతుల నోటికందని పరిస్థితి ఏర్పడింది. అశ్వారావుపేట మండలం పండువారిగూడెం గ్రామంలో సుమారు 120 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. గ్రామంలో పత్తి 210 ఎకరాలు, మినుము 180 ఎకరాలు, మొక్కజొన్న 30 ఎకరాలు, వరి 30 ఎకరాల్లో సాగు చేశారు.


Murasu Tuffanపత్తి సాగుకు ఎకరాకు సుమారు రూ.50 వేలు, మొక్కజొన్నకు రూ.40 వేలు, వరికి రూ.20 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. పత్తి దూది తీసేందుకు సిద్ధంగా ఉండగా, మినుము కోతకు సిద్ధమైంది. మొక్కజొన్న పంట ఇంకా మొక్క దశలో ఉండగా, వరి పొట్ట దశలో ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా పత్తి దూది తీయకుండానే కాయల్లోని పత్తి తడిసి నల్లబడింది. కొన్ని కాయల్లో తిరిగి మొగ్గలు రావడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే బయటకు వచ్చిన కొంత పత్తి తడిసి నల్లబడి పనికిరాకుండా పోయింది. కోతకు సిద్ధంగా ఉన్న మినుము తడిసి మొలకలు రావడం ప్రారంభమైంది. వర్షపు ధాటికి మొక్కజొన్న పంట కొట్టుకుపోగా, వరి పంట విరిగి నేలకొరిగి నలిగిపోయింది.


మురసు తుఫాన్‌తో ధ్వంసమైన పంటలను శనివారం రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు చిరంజీవి పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటికే అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతులకు తాజా ప్రకృతి వైపరీత్యం మరింత భారంగా మారిందన్నారు. పంట నష్టాన్ని వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే అంచనా వేసి, నష్టపోయిన ప్రతి రైతుకు తక్షణమే ప్రభుత్వ నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) మండల కార్యదర్శి సోడెం ప్రసాద్,మండల కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు,మండల కమిటీ సభ్యులు దుర్గా రావు,సీసం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్