Sunday, August 16, 2026
E-PAPER
Homeచైల్డ్ హుడ్అహంకారం వద్దు

అహంకారం వద్దు

- Advertisement -

ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. దానికి తన శరీరం, బలం చూసుకుని చాలా అహంకారం. ”ఈ అడవిలో నా అంత బలవంతుడు ఎవరూ లేరు” అని గర్వపడుతూ, దారిలో కనిపించే చిన్న చిన్న జంతువులను వేధించేది.
ఒక రోజు ఆ ఏనుగు ఒక చెట్టు కింద సేదతీరుతుండగా, ఒక చిన్న చీమల పుట్ట కనిపించింది. ఏనుగు గర్వంతో తన తొండంతో నీళ్లు తెచ్చి ఆ పుట్ట మీద చల్లింది. చీమలన్నీ నీటిలో మునిగిపోయి ఇబ్బంది పడ్డాయి. చీమల రాజు బయటకు వచ్చి, ”ఏనుగు బావా! మేము నీకేం అపకారం చేయలేదు కదా, ఎందుకు మమ్మల్ని బాధిస్తున్నావు?” అని అడిగింది.
దానికి ఏనుగు పెద్దగా నవ్వి, ”మీలాంటి చిన్న ప్రాణులు నన్ను ప్రశ్నించడమా? నేను తలచుకుంటే మిమ్మల్ని ఒక్క కాలితో తొక్కి చంపేయగలను. అహంకారంతో మాట్లాడితే మిమ్మల్ని నాశనం చేస్తా!” అని బెదిరించింది. చీమల రాజు ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయింది, కానీ ఏనుగుకు తగిన గుణపాఠం చెప్పాలనుకుంది.
కొద్ది రోజుల తర్వాత, ఏనుగు ఒక చెట్టు కింద హాయిగా నిద్రపోతోంది. అది చూసిన చిన్న చీమ ఒకటి మెల్లగా వెళ్లి ఏనుగు తొండంలోకి దూరింది. లోపలికి వెళ్లాక, అది ఏనుగును గట్టిగా కుట్టడం ప్రారంభించింది.
తొండంలో విపరీతమైన నొప్పితో ఏనుగు నిద్రలేచింది. బాధతో తల నేలకు వేసి కొట్టుకుంది, పెద్దగా అరిచింది. నీటిలో మునిగి చూసింది, తొండాన్ని ఊపి చూసింది, కానీ ఏమీ ఉపయోగం లేకపోయింది. చీమ మాత్రం లోపల కుడుతూనే ఉంది. ఏనుగు తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుని, ”అయ్యో! ఎవరైనా నన్ను కాపాడండి, నొప్పి తట్టుకోలేకపోతున్నాను” అని ఏడవడం మొదలుపెట్టింది.
అప్పుడు చీమ తొండం బయటకు వచ్చి, ”ఏనుగు బావా! ఇప్పుడు నీ బలం, నీ శరీరం నిన్ను కాపాడగలిగాయా? పరిమాణంలో చిన్నదైనా ఒక చిన్న చీమ కూడా నిన్ను లొంగదీసుకోగలదని అర్థమైందా?” అని అడిగింది.
ఏనుగు తన తప్పు తెలుసుకుంది. ”నన్ను క్షమించు చీమ రాజా! నా బలం చూసుకుని అహంకారంతో ప్రవర్తించాను. చిన్న ప్రాణులను తక్కువగా అంచనా వేశాను. ఇకపై ఎప్పుడూ ఎవరినీ వేధించను” అని వేడుకుంది. చీమ దయతలిచి ఏనుగును ఏమీ చేయకుండా వదిలేసింది. ఆ రోజు నుంచి ఏనుగు తన గర్వాన్ని వదిలేసి, అడవిలోని జంతువులన్నింటితో ఆప్యాయంగా ఉండటం నేర్చుకుంది.
నీతి : మన బలం, అందం లేదా సంపదను చూసి అహంకారం చూపకూడదు.

యాడవరం చంద్రకాంత్‌ గౌడ్‌ 9441762105

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -