కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా
టిమ్స్ సనత్‌నగర్
1,082 పడకలు.. 300 ఐసీయూ బెడ్స్
31 మేజర్ ఆపరేషన్ థియేటర్లు
1–2 నిమిషాల్లో పరీక్షల
నమూనాల తరలింపు
75 శాతం నీటి పొదుపుతో గ్రీన్ ఆస్పత్రి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సామాన్య ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సనత్‌నగర్ లో నిర్మించిన ప్రతిష్ఠాత్మక డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్)ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభిం చనున్నారు. ప్రభుత్వ వైద్యరంగంలో అత్యాధునిక సౌకర్యాలతో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా టిమ్స్ సనత్‌నగర్ రూపు దిద్దుకుంది. ప్రభుత్వ రంగంలో ఒకే దశలో నిర్మించిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఇది ప్రత్యేకతను సంతరిం చుకుంది. 22.6 ఎకరాల విస్తీర్ణంలో, 11.70 లక్షల చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణంతో ఈ సమగ్ర వైద్య సముదాయాన్ని అభివృద్ధి చేశారు. క్లాసిక్ ఆర్కిటెక్చర్‌తో నాలుగు బ్లాకులుగా నిర్మించిన టిమ్స్ 75 శాతం నీటి పొదుపుతో ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ సాధించింది. ఆరు కీలక విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా దీన్ని తీర్చిదిద్దారు. ఈ ఆస్పత్రిలో రోగులకు సమగ్ర వైద్య సేవలు అందనున్నాయి. ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో నిర్మితమైన టిమ్స్ లో ఏర్పాటు చేయటం విశేషం. ఈ వ్యవస్థ ద్వారా రోగుల నుంచి పరీక్షలు చేసేందుకు సేకరించిన నమూనాలు ఒకటి నుంచి రెండు నిమిషాల్లోనే సంబంధిత పరీక్షా కేంద్రాలకు చేరతాయి.
నిమిషాల్లోనే రక్త నమూనాలు.. ఏఐ ఆధారిత పైప్ వ్యవస్థ
టిమ్స్ సనత్‌నగర్‌లో అత్యంత ప్రత్యేకమైన సాంకేతిక సదుపాయాల్లో ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థ ఒకటి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దేశంలోనే తొలిసారిగా ఈ తరహా వ్యవస్థను టిమ్స్ సనత్ నగర్ లో ఏర్పాటు చేశారు. సీల్డ్ ట్యూబ్‌లు, గాలి ఒత్తిడితో రక్త నమూనాలు, మందులు, వైద్య నివేదికలు, అత్యవసర వినియోగ వస్తువులను వార్డులు, అత్యవసర విభాగం, ల్యాబ్‌లు, ఫార్మసీ, బ్లడ్ బ్యాంక్‌ల మధ్య కేవలం 1–2 నిమిషాల్లో ఈ విధానం ద్వారా తరలించవచ్చు. దీంతో పరీక్షల ఫలితాల కోసం పట్టే సమయం తగ్గడంతోపాటు కలుషితమయ్యే ప్రమాదం కూడా తగ్గుతుంది.
ఆరు కీలక విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
అవయవ మార్పిడి, కార్డియాక్ సైన్సెస్, ఆంకాలజీ, న్యూరోసైన్సెస్, నెఫ్రాలజీ, ట్రామా కేర్ వంటి ఆరు ప్రధాన రంగాల్లో టిమ్స్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రభుత్వం తీర్చిదిద్దింది. కిడ్నీ, కాలేయం, గుండె, బహుళ అవయవ మార్పిడి సేవలకు ఇక్కడ అవకాశం ఉంది. ఆధునిక కార్డియోథొరాసిక్ శస్త్రచికిత్సలు, లీనాక్ ఆధారిత రేడియోథెరపీ, 24 గంటల అత్యవసర వైద్య సేవలు, ఐసీయూ బ్యాకప్‌తో 30 క్లినికల్ విభాగాలు అందుబాటులో ఉన్నాయి.
అత్యాధునిక స్కానింగ్ సదుపాయాలు
ఆస్పత్రిలో 3.0 టెస్లా ఎంఆర్‌ఐ, 128-స్లైస్ సీటీ స్కానర్, అధునాతన మామోగ్రఫీ యూనిట్, 5 ఎక్స్‌రే యంత్రాలు ఏర్పాటు చేశారు. రోగులతో వచ్చే సహాయకుల కోసం జీ+5 అంతస్తుల్లో నిర్మించిన ధర్మశాలలో 200 మందికి వసతి కల్పించేలా సదుపాయాలు ఉన్నాయి. 30 మృతదేహాల సామర్థ్యంతో మార్చురీతో పాటు, కేంద్ర వంటశాల, లాండ్రీ, వైద్య వాయు (మెడికల్ ఆక్సిజన్) పైప్‌లైన్ వ్యవస్థలకు ప్రత్యేక బ్లాకులు ఇందులో నిర్మించారు.
75 శాతం నీటి పొదుపు.. ఐజీబీసీ గోల్డ్ రేటింగ్
టిమ్స్ సనత్‌నగర్ నిర్మాణంలో పర్యావరణహిత సాంకేతికతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ విధానం ద్వారా 75 శాతం నీరు ఆదా అవుతుంది. తగిన సామర్థ్యంతో ఎస్టీపీ, ఈటీపీలు ఏర్పాటు చేసి మురుగునీరు, వ్యర్థ ద్రవాలను ఈ ఆస్పత్రిలో శుద్ధి చేయనున్నారు. వర్షపు నీటిని సేకరించి యార్డ్ వాటర్ సంప్‌ల ద్వారా మొక్కలు, గ్రీన్ కారిడార్లకు వినియోగించే విధానం టిమ్స్ సనత్ నగర్ లో అమలు కానుంది. పర్యావరణహిత నిర్మాణం, ఇంధన సామర్థ్య వ్యవస్థల కారణంగా ప్రాజెక్టుకు ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ లభించింది.
35 లక్షల సురక్షిత పని గంటలు
నిర్మాణ సమయంలో 35 లక్షల సురక్షిత పని గంటలు నమోదు చేసినట్లు ఎంఈఐఎల్ గ్రూప్ తెలిపింది. ప్రమాదాలు చోటు చేసుకోకుండా నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సంస్థ పేర్కొంది.
నాలుగు బ్లాకులు.. సమగ్ర వైద్య సేవలు
ఆస్పత్రిని నాలుగు ప్రధాన బ్లాకులుగా ప్రభుత్వం నిర్మించింది. మొత్తం 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఇందులో ఉన్నాయి. డయాగ్నస్టిక్స్ విభాగంలో 17 పాథాలజీ ల్యాబ్‌లు, 12 మైక్రోబయాలజీ ల్యాబ్‌లు, 10 బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లు, 5 ప్రత్యేక ల్యాబ్‌లు ఉన్నాయి. బ్లాక్-ఏలో అత్యవసర సేవలు, 15 ఆపరేషన్ థియేటర్లు, 30 ఐసీయూ బెడ్లు, సెంట్రల్ స్టెరైల్ సర్వీస్ విభాగం ఉన్నాయి. బ్లాక్-బీలో ఓపీ రిజిస్ట్రేషన్, సెంట్రల్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లీనాక్ ఆధారిత న్యూక్లియర్ మెడిసిన్ విభాగం, రెండు క్యాథ్‌ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. బ్లాక్-సీలో రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్‌లు, సాధారణ, ప్రయివేటు వార్డులు, వీఐపీ సూట్లు ఉన్నాయి. బ్లాక్-డీలో పరిపాలన, విద్యా విభాగాలతోపాటు 200 మంది కూర్చునే ఆడిటోరియం ఉంది.
ఒకే మాస్టర్‌ప్లాన్‌తో.. పూర్తి స్థాయి వైద్య సముదాయం
ఆస్పత్రిని నాలుగు ప్రధాన బ్లాకులుగా ప్రభుత్వం నిర్మించింది. మొత్తం 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఇందులో ఉన్నాయి. డయాగ్నస్టిక్స్ విభాగంలో 17 పాథాలజీ ల్యాబ్‌లు, 12 మైక్రోబయాలజీ ల్యాబ్‌లు, 10 బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లు, 5 ప్రత్యేక ల్యాబ్‌లు ఉన్నాయి. బ్లాక్-ఏలో అత్యవసర సేవలు, 15 ఆపరేషన్ థియేటర్లు, 30 ఐసీయూ బెడ్లు, సెంట్రల్ స్టెరైల్ సర్వీస్ విభాగం ఉన్నాయి. బ్లాక్-బీలో ఓపీ రిజిస్ట్రేషన్, సెంట్రల్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లీనాక్ ఆధారిత న్యూక్లియర్ మెడిసిన్ విభాగం, రెండు క్యాథ్‌ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. బ్లాక్-సీలో రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్‌లు, సాధారణ, ప్రయివేటు వార్డులు, వీఐపీ సూట్లు ఉన్నాయి. బ్లాక్-డీలో పరిపాలన, విద్యా విభాగాలతోపాటు 200 మంది కూర్చునే ఆడిటోరియం ఉంది.
ప్రభుత్వ వైద్యరంగంలో కొత్త ప్రమాణం
హైదరాబాద్ నడిబొడ్డున క్లాసిక్ ఆర్కిటెక్చర్‌తో కాంక్రీట్ నిర్మాణంగా రూపుదిద్దుకున్న టిమ్స్ సనత్‌నగర్ ప్రభుత్వ వైద్యరంగంలో భారీ స్థాయి మౌలిక వసతులు, అత్యాధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ, భద్రతను సమన్వయం చేసిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా నిలిచింది. సామాన్య ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో లభించే స్థాయి అధునాతన వైద్య సేవలను ప్రభుత్వ వ్యవస్థలోనే అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యానికి ఈ ఆస్పత్రి ప్రతీకగా నిలవనుంది. ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ప్రయివేటు, కార్పొరేట్ వైద్య సంస్థలకు దీటైన స్థాయిలో ఆధునిక, సూపర్ స్పెషాలిటీ సేవలు అందించగలవని ఈ ప్రాజెక్టు చాటిచెబుతోందని వైద్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం
డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వివిధ శాఖల ఉన్నతాధి కారులతో సమీక్ష నిర్వహిం చారు. ప్రారంభోత్సవ కార్య క్రమానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రారంభోత్సవం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమ వేదిక, ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు తదితర అంశాలపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని ట్రాఫిక్ పోలీసులను మంత్రి ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే వ్యవస్థలను ముందుగానే పరిశీలించాలని పోలీసులకు సూచించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, డా. ఎంసీఆర్ టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, ఐ అండ్ పీఆర్ కమిషనర్ ముకుంద రెడ్డి, హైదరాబాద్ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, అదనపు డీసీపీ (ట్రాఫిక్) వేణుగోపాల్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



