మా సొంతూరు ఖమ్మం. నాన్న తంగిరాజు సీతా రామ్ దయాకర్, అమ్మ కృష్ణకుమారి. నాన్న బ్యాంక్ మేనేజర్‌గా చేసి రిటైర్ అయ్యారు. వారికి మేము ఇద్దరం పిల్లలం. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. తన పేరు కిషన్ చంద్. చిన్నప్పుడు ఇంటి ముందుకు పూలు అమ్మే వాళ్ళు రాగానే ‘మా అక్కకు పూలంటే ఇష్టం’ అని కొనేవాడు. ఇలా నాకు ఇష్టమైనవి ఏమైనా సరే గుర్తు పెట్టుకుని తెచ్చేవాడు. ఇద్దరం చదివింది ఒకే స్కూల్ అయినప్పటికీ తను చిన్న క్లాస్ కాబట్టి ముందు వెళ్లిపోయేవాడు. లంచ్ టైంలో నేను తన క్లాస్‌కి వెళ్లి లంచ్ బాక్స్ ఇవ్వడం, భుజం మీద చేయి వేసి ‘ఏరా ఏంటీ సంగతి, ఎలా ఉన్నావు’ ఇలా అడుగుతూ ఉండేదాన్ని. తనకు స్పోట్స్ అంటే చాలా ఇష్టం. అయితే మా ఇంట్లో కొన్ని ఆంక్షలు ఉండేవి. ఫలానా వారి ఇంటికి వెళ్ళొద్దు.. ఇలాంటివి కొన్ని ఉండేవి. ఆ రోజుల్లో డీవీడీలు ఉండేవి. ఎవరికీ చెప్పకుండా మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్లి సినిమాలు చూసేవాడు.
ఇక చదువు విషయానికి వస్తే నేను చాలా బాగా చదివేదాన్ని. తమ్ముడు పర్వాలేదు. పరీక్షల ముందే చాలా శ్రద్ధగా చదివేవాడు. తన దగ్గర నోట్స్ లేకుంటే, తన స్నేహితుల దగ్గర నుండి నోట్స్ తెచ్చి రాసేదాన్ని. అల్లరి పనులు బాగా చేస్తాడు. పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు ఎంత పర్సెంటేజ్ వచ్చిందని ఎవరైనా అడిగితే 90% వచ్చింది అని చెప్పేవాడు. నేను అమ్మ దగ్గరకు వెళ్లి ‘చూడమ్మా వీడు అందరికీ అలా చెప్తున్నాడు’ అంటే, ‘అటెండెన్స్ కూడా పెర్సెంటేజే కదా’ అని నవ్వేవాడు. ఇది అబద్ధం కాదు కదా, నిజమే చెప్పాను కదా అనేవాడు. ఇప్పుడు పెద్దయ్యాక ఎవరి సంసారాలు వారివి. బాధ్యతలు పెరిగాయి. కాకపోతే తరచూ మాట్లాడుకుంటూ ఉంటాము. ప్రస్తుతం నేను ఉద్యోగ రీత్యా అహ్మదాబాద్‌లో ఉంటున్నాను. ఇప్పటికీ తాను నాకు ఎంతో అండగా ఉంటాడు. రాఖీ పండుగ వస్తే ఆ సందడే వేరుగా ఉండేది. మా బంధువుల పిల్లలు అందరూ రాఖీ కట్టేవారు.
చేతికి ఎన్ని రాఖీలు ఉన్నాయో అని లెక్క పెట్టుకునే వాడు. మా అన్నయ్య (బంధువు)కూడా ఉండేవారు. ఎవరి చేతికి ఎక్కువ రాఖీలు ఉంటే వారు చాలా గొప్పగా భావించేవారు. ఇలా మా బాల్యం చాలా సంతోషంగా గడిచిపోయింది. బిజీ జీవితాలతో అనుబంధాలు, ఆప్యాయతలు మరిచిపోతున్న ఈ కాలంలో ఇలాంటి పండుగలు ఒక్క రోజైనా అందరినీ ఒక దగ్గరకు చేర్చడం వల్ల కొంతైనా ఆనందంగా ఉండగలుగుతున్నాం. అక్కని కాబట్టి తన విషయంలో చాలా కేరింగ్‌గా, తమ్ముడు అంటే చిన్న వాడు కదా అనే భావనతో ఎప్పుడూ తన పట్ల బాధ్యతగా ఉండేదాన్ని. చెప్పిన మాట వినే వాడు. నా పట్ల గౌరవంగా ఉండేవాడు. చిన్నప్పటి అల్లర్లు, పెద్దయ్యాక మధుర జ్ఞాపకాలు, కాలం మారినా, మారనిది అక్క తమ్ముళ్ల అనుబంధం. రాఖీ పండుగ సందర్భంగా తమ్ముడిని గుర్తు చేసుకుంటూ…
డా.సునంద, అహ్మదాబాద్
కాలం మారినా అనుబంధం మారదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


