బియ్యం, బట్టలు, వంటసామాగ్రితో
భోపాల్‌కు కదిలిన రెండు వేల మంది
ఎస్కేఎం ఆధ్వర్యంలో అన్నదాతల ఆందోళన
డిమాండ్లపై స్పందించకుండా బారికేడ్లతో అడ్డగింత
బీజేపీ సర్కారుపై రైతుల ఆగ్రహ జ్వాలలు
ప్రభుత్వం దిగివచ్చే వరకూ
ఉద్యమం కొనసాగుతుందని స్పష్టీకరణ
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో రైతాంగ అసంతృప్తి భగ్గుమంది. మూంగ్ పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందనీ, ఎరువుల సమస్యలను పరిష్కరించలేదని ఆరోపిస్తూ వేలాది మంది రైతులు రాష్ట్ర రాజధాని భోపాల్ వైపు కదిలారు. వారిని అడ్డుకునేందుకు బీజేపీ ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. బారికేడ్లు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ.. రైతులు వాటిని దాటి రాజధాని శివార్లకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పరిణామం రాష్ట్రంలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో 19 రైతు సంఘాలకు చెందిన సుమారు రెండు వేల మంది రైతులు నర్మదాపురం నుంచి భోపాల్ వరకు పాదయాత్ర చేపట్టారు. వారం పాటు రాజధానిలోనే ఉండేందుకు పరుపులు, ధాన్యపు సంచులు, వంటసామగ్రి, ఆహార పదార్థాలతో బయలుదేరిన రైతులు తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి వెళ్లబోమని ప్రకటించారు. మూంగ్ పంటను 100 శాతం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో ప్రభుత్వం కొనుగోలు చేయాలనేదే రైతుల ప్రధాన డిమాండ్. కేంద్రం తూర్, ఉరద్, మసూర్ పంటలను పూర్తి స్థాయిలో ఎంఎస్‌పీతో కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ.. మూంగ్ పంటను మాత్రం ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద ఉంచి రాష్ట్ర ఉత్పత్తిలో 25 శాతం వరకు మాత్రమే కొనుగోలు చేయడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.
ఫలితంగా మిగిలిన పంటను మార్కెట్‌లో ఎంఎస్‌పీ కంటే తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రైతు నాయకుడు సంతోశ్ పట్వారీ మాట్లాడుతూ.. గత 20 రోజులుగా ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి స్పందనా రాలేదన్నారు. దీంతో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నివాసానికి వెళ్లి తమ గోడు వినిపించడమే మార్గమని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం భోపాల్ శివార్లతో పాటు రైసేన్, విదిశా, హర్దా, నర్మదాపురం, బుధ్ని జిల్లాల్లో భారీగా పోలీసులు మోహరించింది. పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి రైతులను నిలువరించే ప్రయత్నం చేసింది. అయితే రైతులు వాటిని దాటి ముందుకు సాగడంతో ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించడంకంటే ఉద్యమాన్ని అణచివేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొనుగోళ్లలో ఆలస్యం, పరిమితి విధానం, నమోదు సమస్యలు, ఎరువుల కొరత, పెరుగుతున్న సాగు వ్యయాలు రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అయినప్పటికీ బీజేపీ సర్కారు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలో విఫలమైందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఉజ్జయినిలో సింహస్థ కుంభమేళా భూసేకరణ విధానంపై రైతుల నిరసనలతో వెనక్కి తగ్గిన మోహన్ యాదవ్ ప్రభుత్వం.. ఇప్పుడు మూంగ్ రైతుల ఆందోళనతో మరోసారి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వ్యవసాయ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం శాంతి భద్రతల పరిరక్షణ కోసమే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామనీ, రైతులతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్తోంది. కానీ రైతులు మాత్రం తమకు కావాల్సింది హామీలు కాదనీ, స్పష్టమైన నిర్ణయమని అంటున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకూ భోపాల్‌లోనే తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్తున్నారు.



