విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు
పంటల వైవిధ్యీకరణ, సూక్ష్మనీటిపారుదల :
వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
వ్యవసాయ రంగంలో నీటి వినియోగాన్ని, విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు పంటల వైవిధ్యీకరణ, సూక్ష్మ నీటిపారుదల, వ్యవసాయ సౌర విద్యుదీకరణ వంటి చర్యలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనీ, రైతుల్ని కేవలం విద్యుత్ వినియోగదారులుగా కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి. గోపి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియా ఎనర్జీ సమ్మిట్ ఎక్స్‌పో–2026 లో భాగంగా బుధవారం నిర్వహించిన గ్రామీణ భారతదేశానికి విద్యుత్ పునరుత్పాదక ఇంధనం, విశ్వసనీయ విద్యుత్, సమ్మిళిత అభివృద్ధి అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ముఖ్యంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో సాగు విస్తీర్ణం సుమారు 1.31 కోట్ల ఎకరాలుకాగా ప్రస్తుతం అది సుమారు 2.2 కోట్ల ఎకరాలకు చేరుకుందని తెలిపారు. వరి సాగు విస్తీర్ణం మూడు రెట్లకు పైగా పెరిగిందన్నారు. ఉద్యాన పంటల్లో సూక్ష్మ నీటిపారుదల విధానాలను అమలు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు, నీటిని ఎత్తిపోసేందుకు అవసరమయ్యే విద్యుత్ వినియోగాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంటుందని వివరించారు. వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించే దిశగా వ్యవసాయ రంగంలో సౌర విద్యుదీకరణను ప్రోత్సహించాలన్నారు. దానికి అవసరమైన మూలధన పెట్టుబడికి సహకారం అందించడంతో పాటు రైతులకు అనుకూలమైన విధానాలను రూపొందిస్తోందని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు వంటి సంస్థలను సౌర విద్యుదీకరణ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం ద్వారా రైతులే విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ధి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతి క్లస్టర్ స్థాయిలో స్వయం సమృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. పంటల వైవిధ్యీకరణ, సూక్ష్మ నీటిపారుదల, వ్యవసాయ సౌర విద్యుదీకరణ, రైతు ఉత్పత్తిదారుల సంస్థల భాగస్వామ్యం అంశాలను సమన్వయం చేసుకుని ముందుకెళ్తే వ్యవసాయంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించొచ్చని నొక్కి చెప్పారు.
రైతులను విద్యుత్ ఉత్పత్తిదారులుగా తీర్చిదిద్దాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



