Tuesday, July 21, 2026
E-PAPER
HomeNewsజానీమాస్టర్‌పై నిషేధం ఎత్తివేసిన ఫెడరేషన్

జానీమాస్టర్‌పై నిషేధం ఎత్తివేసిన ఫెడరేషన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొన్నాళ్లుగా కొనసాగుతున్న వివాదానికి ఫిల్మ్ ఫెడరేషన్ మధ్యవర్తిత్వంతో శుభం కార్డు పడింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై విధించిన శాశ్వత నిషేధాన్ని ఫెడరేషన్ అధికారికంగా ఎత్తివేసింది. సినీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చొరవ చూపడంతో ఈ సమస్య సామరస్యంగా పరిష్కారమైంది. ఆదివారం ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం జరిగింది. ఈ భేటీకి దర్శకులు, నిర్మాతల మండలి ప్రతినిధులతో పాటు జానీ మాస్టర్, డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత హాజరయ్యారు. వివాదానికి దారితీసిన పరిస్థితులపై జానీ మాస్టర్, సుమలత ఇచ్చిన వివరణతో ఫెడరేషన్ సంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం జానీ మాస్టర్‌పై విధించిన నిషేధాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ, ఈ వివాదం కారణంగా ఎంతో మంది డ్యాన్సర్లు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవికి, అండగా నిలిచిన నందమూరి బాలకృష్ణకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి స్వయంగా తనతో, శేఖర్ మాస్టర్‌తో మాట్లాడి సమస్యను అర్థం చేసుకున్నారని, బాలకృష్ణ కాకినాడ నుంచి ఫోన్ చేసి సర్దుకుపోవాలని సలహా ఇచ్చారని వివరించారు. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత మాట్లాడుతూ, డ్యాన్సర్ల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. డ్యాన్సర్లు ఇచ్చే రూ.100 చందాతోనే అసోసియేషన్ నడుస్తోందని, కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. సమస్య పరిష్కారానికి సహాయం చేసిన చిరంజీవికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -