– గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
– పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు
నవతెలంగాణ – సత్తుపల్లి
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు కారులో అక్రమంగా రవాణా చేస్తున్న 6.360 కేజీల గంజాయిని సత్తుపల్లి పోలీసులు ఈగల్ టీం బృందం శుక్రవారం మధ్యాహ్నం పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఏసీపీ వసుంధర యాదవ్ ఫారెబి పర్యవేక్షణలో, సత్తుపల్లి సీఐ తుమ్మలపల్లి శ్రీహరి, టీమ్ సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టగా ఈ తనిఖీల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన కామేష్ మారి, కారా రాజేంద్ర అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3,12,500 విలువైన 6 కిలోల 360 గ్రాముల గంజాయి ప్యాకెట్లతో పాటు, ఒక కారు రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.
ఈ ఘటనపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్,1985 (NDPS Act, 1985) చట్ట ప్రకారం కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటుష చేసినట్లు సీఐ శ్రీహరి తెలిపారు. గంజాయి కొనుగోలు, విక్రయాలు లేదా వినియోగానికి పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి సమాచారం అందించిన వారికి తగిన రివార్డు ఇవ్వడంతో పాటు, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ దర్యాప్తులో ఎస్సై ప్రదీప్, ఈగల్ టీమ్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.



