Saturday, July 11, 2026
E-PAPER
Homeసోపతిగ్రేట్‌ లైబ్రరీ

గ్రేట్‌ లైబ్రరీ

- Advertisement -

సాధారణంగా లైబ్రరీ అనగానే అందరికీ గుర్తొచ్చేది ‘నిశ్శబ్దం’. ఇక్కడ ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా రకరకాల పుస్తకాలు చదువుతూ కాలం గడుపుతుంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే లైబ్రరీ పైన చెప్పిన వాటికి పూర్తిగా భిన్నం. ఇక్కడ చదవడంతో పాటు మెషిన్‌ కుట్టడం, గిటార్లు వాయించడం, 3ణ ప్రింటర్లతో బొమ్మలు తయారు చేయడం వంటివి చేస్తుంటారు. ప్రభుత్వం కూడా వీటిని ప్రోత్సహిస్తోంది. వినడానికి వింతగా ఉన్నా ఇవన్నీ నిజాలే. మరి ఆ లైబ్రరీ ఎక్కడ ఉందో, ఆ వివరాలేంటో తెలుసుకుందాం… అది ఫిన్లాండ్‌లో ఉంది. అక్కడి లైబ్రరీలు కేవలం పుస్తకాలు చదువుకునే స్థలం మాత్రమే కాదు. ఆ దేశ ప్రజాస్వామ్యానికీ, సామాజిక అభివద్ధి కోసం బలమైన పిల్లర్లుగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఫిన్లాండ్‌ రాజధాని హెల్సింకీలో ఉన్న ‘ఓడి’ లైబ్రరీ.. ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనదిగా గుర్తింపు పొందింది. ఈ లైబ్రరీలో మూడు అంతస్తులు ఉంటాయి. మొదటి అంతస్తులో ఫ్రెండ్స్‌తో ఎంత గట్టిగా అయినా మాట్లాడుకోవచ్చు. ఇక రెండో అంతస్తులో గ్రూప్‌ మీటింగ్‌లు పెట్టుకోవచ్చు. కుట్టు మిషన్లపై దుస్తులు కుట్టుకోవచ్చు. గిటార్‌, డ్రమ్స్‌ వాయిస్తూ సంగీతం నేర్చుకోవచ్చు. ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువుకునేవారి కోసం మూడో అంతస్తు వుంది. ఈ లైబ్రరీకి వెళ్లేందుకు ఉదయం 8 గంటల నుంచే ప్రజలు క్యూ కడతారు. మధ్యాహ్నాం అయితే సీటు దొరకడం కూడా గగనమే.

ఆ దేశంలో నగరాల్లో ఉండే ప్రజలు చిన్న ఇళ్లల్లో నివసిస్తుంటారు. వారికి కుట్టుమిషన్‌ లాంటి వివిధ వస్తువులు తక్కువ సార్లు అవసరమవుతాయి. అందుకే ఇలా వాటిని లైబ్రరీలో ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు లైబ్రరీలవైపు అడుగులు వేస్తున్నారు. ఇక్కడికి వచ్చే వారు కేవలం కుట్టుమిషన్లే కాకుండా, టెన్నిస్‌ రాకెట్లు, స్విమ్మింగ్‌ పూల్‌ పాస్‌లు కూడా ఉచితంగా అద్దెకు తీసుకోవచ్చు. నగరాల్లోని గ్రంథాలయాలకు రాలేని గ్రామాల ప్రజల కోసం ఫిన్లాండ్‌ ప్రభుత్వం ఆధునిక మొబైల్‌ లైబ్రరీలను నడుపుతోంది. వీటిలో వైఫై, కూర్చోవడానికి సీట్లు, సోలార్‌ ప్యానెల్స్‌ ఉంటాయి. ఇవి వారానికి ఒకసారి నేరుగా గ్రామాలకే వెళ్లి పుస్తకాలను అందిస్తాయి. ఫిన్లాండ్‌ చట్ట ప్రకారం, లైబ్రరీలు కేవలం చదువు కోసమే కాదు ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను పెంపొందించడానికి ఉపయోగపడాలి. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న అనేక లైబ్రరీలు ప్రజలకు ఉచితంగా ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఇక్కడ ప్రొఫెసర్‌, నిరుద్యోగి, నిరాశ్రయుడు ఇలా ఎవరైనా సరే ఒకేచోట కూర్చొని మాట్లాడుకుంటారు. పేద, గొప్ప అనే తేడా ఇక్కడ ఉండదు. నిజమైన ప్రజాస్వామ్యానికి, సమానత్వానికి ఈ లైబ్రరీలే నిలువెత్తు సాక్ష్యాలు. అయితే ఈ దేశంలో లభించే లైబ్రరీ సేవలను పొందాలంటే ‘లైబ్రరీ కార్డ్‌’ అత్యంత కీలకమైనది. ఆ దేశానికి చెందిన వారు మాత్రమే కాకుండా పర్యాటకులు కూడా కార్డును ఉచితంగా పొందవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -