శ్రీశైలానికి క్రమంగా పెరుగుతున్న ప్రవాహం
రాష్ట్రంలో ని పలు జిల్లాల్లో ఇప్పటికీ పడని వాన
నవతెలంగాణ- ధరూర్/విలేకరులు
రాష్ట్రంలో వర్షాలు, వరదలు, ప్రాజెక్టుల్లో వింత పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు ఓ మోస్తరు వర్షాలు, జల్లులు తప్ప భారీ వర్షం కురిసిందే లేదు. ప్రాజెక్టులు నిండింది లేదు.. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు.. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదతోనే జూరాలకు క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతోంది. మంగళవారం జూరాల ప్రాజెక్టు 33 గేట్లను అధికారులు ఎత్తి దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2,41,000 క్యూసెక్కులు, ఔవుట్ ఫ్లో 2,53,102 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లకుగాను.. ప్రస్తుత నీటిమట్టం 317.240 మీటర్లకు చేరింది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి సామర్థ్యం 8.631 టీఎంసీలుగా నమోదైంది. వరద ప్రవాహం నేపథ్యంలో ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి 26,817 క్యూసెక్కుల నీరు వాడుతునట్టు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.631 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నెట్టెంపాడుకు 750, బీమా లిఫ్ట్-వన్ 1300, కోయిల సాగర్ 640, ఎడమ కాలువ 840, కుడి కాలువకు 700, బీమా లిఫ్టు-2కు 872, ప్యానల్ కాలువకు 600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును మంగళవారం గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పరిశీలించారు. నీటి నిల్వ సామర్థ్యం, గేట్ల ద్వారా విడుదల అవుతున్న నీరు, ఎత్తిపోతల పథకాలు, కాలువలకు అందుతున్న నీటి వివ రాలను అధికారులను అడిగి తెలుసుకు న్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
శ్రీశైలంలోకి క్రమంగా పెరుగుతున్న వరద
ఎగువ పరివాహక ప్రాంతాలు, కర్నాటకలో కురుస్తున్న వర్షాల వల్ల శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల పెరగడంతో జూరాల మీదుగా శ్రీశైలానికి భారీగా నీరు వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,53,543 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 859.30 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 103.89 టీఎంసీలుగా ఉంది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే కొద్దిరోజుల్లోనే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంది.
నాగార్జునసాగర్ పరిస్థితి
నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం 590 అడుగులకుగాను మంగళవారం సాయంత్రానికి 513.10 అడుగులుగా ఉంది. 312 టీఎంసీల సామర్థ్యానికిగాను ప్రస్తుతం 137 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ జలాశయ కనీస నీటి మట్టం 510 అడుగులకు అతి చేరువలో ఉంది. ప్రస్తుతం సాగర్ నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మూసీలో..
మూసీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి క్రమంగా వరద ప్రవాహం పెరుగడంతో 638.20 అడుగుల వద్ద నీటిమట్టం స్థిరంగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు. నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.82 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ కాలువల ద్వారా 649.34 క్యూసెక్కుల నీరును సాగు కోసం విడుదల చేస్తున్నారు. మూసీ ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 711 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు. ప్రాజెక్టు పరిస్థితిని ఎప్పటి కప్పుడూ సమీక్షిస్తున్నామని డ్యామ్ ఇంజినీర్లు డీఈ ఎన్.రమేష్, ఏఈ మధు తెలిపారు.
జూరాలకు భారీగా వరద.. 33 గేట్లు ఎత్తివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


