కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
యువోద్యమంతో దిగొచ్చిన మోడీ సర్కార్..దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకపవనాలు
కేంద్ర మంత్రులతో సీజేపీ నేతల చర్చలు సఫలం..డిమాండ్ల పరిష్కారానికి అంగీకారం
ఆందోళనలు విరమిస్తున్నట్టు సీజేపీ ప్రకటన..విద్యార్థుల పోరాటస్ఫూర్తిని కొనియాడిన ప్రతిపక్షాలు..ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు
రాజ్యహింస మీద ‘విద్యార్థి’ విజయం సాధించాడు. ఆ విజయం కోసం తన ఒళ్లు హూనం చేసుకున్నాడు. పరిస్థితులు చేతులు దాటి సమస్య విశ్వవ్యాప్తమవుతున్నదని భయపడిన మోడీ సర్కార్ ‘జెన్ జీ’ పోరాటానికి తలవంచక తప్పలేదు. ‘నీట్’ సహా పలు పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీలకు బాధ్యుడైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. నిముషాల వ్యవధిలోనే ఆయన రాజీనామాను రాష్ర్టపతి ద్రౌపదీముర్ము ఆమోదించారు. ఆ వెంటనే కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, నూతన పునురుత్పాదక ఇంధనశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి అదనంగా విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయాలన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోనే జరిగాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) స్వాగతించింది.
ప్రాణాలకు తెగించి మోడీ ప్రభుత్వంపై పోరాడిన విద్యార్థి, యువజన ఉద్యమ స్ఫూర్తిని సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ కీర్తించాయి. యువతరం మార్పును కోరుకుంటోంది అనడానికి ఇదే నిదర్శనమని ఆపార్టీల నాయకులు చెప్పారు. మరోవైపు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో సీజేపీ ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. వారి మిగిలిన డిమాండ్లను కూడా పరిష్కరిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు. విద్యార్థుల కోసం 26 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన సోనమ్ వాంగ్‌చుక్ ఇది ‘జెన్ జీ’ విజయం అని కొనియాడారు. దేశ యువతను, ప్రజల్ని మతం మత్తులో ఉంచి రాజకీయాలు చేస్తూ, మనుస్మృతిని అమల్లోకి తేవాలని తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌కు ఇది పెద్ద ఎదురు దెబ్చే! సుమతీ శతకకారుడు ఈ ‘జెన్ జీ’ పోరాటాన్ని చూసి ఉంటే..‘‘బలవంతుడైన పాలకుడు ‘బొద్దింకల’ చేత చిక్కి తలవంచునె సుమతీ’’..అని కచ్చితంగా రాసి ఉండేవారు!!
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నీట్ ప్రశ్నాపత్రం లీక్, సీబీఎస్‌ఇ అవకతవకలకు జవాబుదారీతనం వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత 36 రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ ) ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి, యువత చేసిన ఉద్యమం విజయం సాధించింది. ఎట్టకేలకు కేంద్ర మంత్రి రాజీనామాతో పాటు సీజేపీ ప్రతిపాదించిన డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో విద్యార్థి, యువత విజయ యాత్ర చేపట్టారు. జంతర్ మంతర్‌లో సంబరాలు మిన్నంటాయి. ఐక్య పోరాట నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. తమకు ఎదురే లేదనుకున్న అధికారపార్టీ నాయకులు… విద్యార్థులు, యువత చేపట్టిన ఉద్యమానికి తలొగ్గక తప్పలేదు. ఉగ్రవాదులకు సీజేపీ బీ టీం, సంఘ విద్రోహశక్తులంటూ విమర్శలు చేసిన నేతలే, ఉద్యమిస్తోన్న విద్యార్థులు, యువతే నిజమైన దేశభక్తులంటూ పరోక్షంగా అంగీకరించాల్సి వచ్చింది. ఇదొక చారిత్రాత్మక, ప్రజాస్వామ్య విజయమంటూ విద్యార్థి, యువజన సంఘాల నేతలు పేర్కొన్నారు. ఈ విజయం భవిష్యత్తుకు స్ఫూర్తి, విద్యార్థులలు, యువత సమిష్టి విజయమని ప్రతిపక్ష నేతలు అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు ఇతర డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తూ హామీ ఇవ్వడంతో ఆందోళనలు విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది.
విద్యార్థులు ఆత్మహత్యులు చేసుకున్నా అధికారాన్ని అంటిపెట్టుకుని ఉన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, దేశంలోని విద్యార్థి, యువజనులు ఉద్యమించడంతో రాజీనామా చేశారు. సీజేపీ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ, ఏఐఎస్ఎఫ్, తదితర విద్యార్థి సంఘాల నాయకత్వంలో జంతర్ మంతర్ వద్ద ప్రారంభమై, ఆ తరువాత దేశవ్యాప్తంగా విస్తరించిన ఉద్యమం, బీజేపీ రాజకీయ రక్షణ వలయాన్ని బద్దలు కొట్టి, కేంద్ర మంత్రి ప్రధాన్ చేత రాజీనామా చేయించింది. ఈనెల 20న సీజేపీ నిర్వహించిన పార్లమెంటరీ మార్చ్ తర్వాత కూడా ప్రధానమంత్రి మోడీ, కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామాను నివారించడానికి అన్ని ఎత్తుగడలూ వేసి విఫలమయ్యారు. పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష కూడా ప్రభుత్వ వ్యతిరేక అలలను సృష్టించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయడానికి, పరీక్షల్లో మోసానికి పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించడానికి ఒక బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ, ఎన్‌టిఎలో కీలక అధికారులను తొలగించినప్పటికీ, విద్యార్థులు ప్రధాన్ రాజీనామాకే కట్టుబడి ఉన్నారు. పోలీసుల అణచివేతను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఒక కొత్త పోరాట గాథను లిఖించారు. ‘‘ఇది మొదటి విజయం. మనం ఇక్కడితో ఆగిపోము. ఇది కేవలం ఆరంభం మాత్రమే. గత 36 రోజులుగా ఇక్కడ కూర్చుని ఉన్న విద్యార్థులు, స్వచ్ఛంద కార్యకర్తలందరికీ నేను వందనం చేస్తున్నాను’’ అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
విద్యార్థి, యువజన ఉద్యమంలో కీలక డిమాండ్ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా. శనివారం కూడా సీజేపీ ఆ డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. మధ్యాహ్నం లోగా ఆయన రాజీనామా చేయకపోతే, చర్చల వల్ల ఫలితమేమీ ఉండదని స్పష్టం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున్న సాగుతున్న ఈ ఉద్యమానికి దిగొచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన రాజీనామా లేఖను పంపినట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. లేఖ ద్వారా ఆయన పరీక్షల నిర్వహణ, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, రాజీనామా నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను దేశ ప్రజలకు సుదీర్ఘంగా వివరించారు. తొలి రోజు నుంచే ఈ ఘటనకు తానే పూర్తి బాధ్యత వహించానని, పరీక్షల మాఫియా కారణంగా ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి భవిష్యత్తు పాడవకుండా చూసేందుకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలు, గత 10 రోజులుగా దేశంలో నెలకొన్న పరిస్థితులపై ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ స్వార్థానికి వాడుకోకూడదని, దేశ ఐక్యత దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రధాన్ రాజీనామా ప్రకటన వెలువడిన వెంటనే, జంతర్ మంతర్ వద్ద ఉన్న సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్‌ను అభిజిత్ దీప్కే ఆలింగనం చేసుకున్నారు. ఆదివారం నాడు ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా విజయ దినోత్సవ వేడుకలు నిర్వహించనుంది.
చర్చలు సఫలం…ఆందోళన విరమణ
సీజేపీ ప్రతిపాదించిన మూడు ప్రధాన డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం, సీజే ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం శనివారం సాయంత్రం కాన్ట్సిట్యూషన్ క్లబ్‌లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా మధ్య మూడో దశ చర్చలు జరిగాయి. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రులు, సీజేపీ ప్రతినిధులు మాట్లాడారు. సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ ‘ప్రభుత్వ ప్రతినిధులతో మూడు రౌండ్లు చర్చలు జరిపాం. మూడు ప్రధాన డిమాండ్లతలో మేము జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా నిరసన చేపట్టాం. వీటిలో మొదటిది.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నిరసనకారులు, సీజేపీ నేతలపై ఢిల్లీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోలీసులు పెట్టిన కేసులు, ఎఫ్‌ఐఆర్‌లను విరమించుకోవాలి. అంతేకాదు.. భవిష్యత్తులో నీట్ నిరసనకారులపై ఎలాంటి కేసులు పెట్టొద్దు. అలానే నీట్ పరీక్ష రద్దుతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం చెల్లించాలి.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో మా మొదటి డిమాండ్ నెరవేరింది. మిగతా డిమాండ్లపై ప్రభుత్వం హామీ ఇచ్చారు’ అని అన్నారు. సీజేపీ ప్రతినిధులు తమ ఆందోళనను విరమిస్తున్నామని ప్రకటించారు. జంతర్‌మంతర్ నుంచి విద్యార్థులు, యువత తిరిగి వెళ్లాలని కోరారు. తాము ఆశించిన చర్యలను కేంద్రం త్వరిత గతిన తీసుకుంటుందన్న విశ్వాసంతో ఆందోళనను విరమిస్తున్నామని అన్నారు. పరీక్షల సంస్కరణలకు సంబంధించి సీజేపీ ప్రతిపాదించిన ఐదు అంశాల అజెండాను ప్రభుత్వం పరిశీలిస్తుందని, ఈ సంస్కరణలపై మరింత చర్చించేందుకు సీజేపీ ప్రతినిధులు ప్రభుత్వంతో సమావేశం అవుతారని చెప్పారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ ‘‘మీరు మా ముందు ఉంచిన డిమాండ్లపై, విద్యా వ్యవస్థలో సూచించిన సంస్కరణలపై మేము అధ్యయనం చేస్తాం. మీ పార్టీకి చెందిన మరికొందరు ప్రతినిధులతో కూడా చర్చలు జరుపుతాం. అలానే.. నష్టపరిహారంపై నిబంధనలకు లోబడి నిర్ణయం తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు.
యువత సాధించిన విజయంః సోనమ్ వాంగ్‌చుక్
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ హర్షం వ్యక్తం చేశారు. ఇది పట్టుదలతో యువత సాధించిన విజయమని పేర్కొన్నారు. జెన్-జి, సీజేపీ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో శనివారం ఓ పోస్టు పెట్టారు. ‘ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఇది శాంతి, ఓర్పు, నిరంతర పట్టుదలల విజయం. దేశంలోని సీజేపీ, జెన్-జీ యువతకు అభినందనలు. భయాన్ని వీడి దేశం నలుమూలల నుంచి పోరాటానికి కదలివచ్చిన పౌరులందరికీ ధన్యవాదాలు. ఇప్పటివరకు బాధ్యతాయుతమైన సమాధానం కోరాం. ఇకపై సంస్కరణల వైపు సాగుదాం’ అని పేర్కొన్నారు.
మార్పు తీసుకొచ్చే కొత్త శకం ఉదయిస్తుంది : అఖిలేష్ యాదవ్
లక్నో: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను స్వాగతిస్తూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ దీన్ని ‘‘నైతిక విజయం, ఐక్యతకు నిదర్శనం’’గా అభివర్ణించారు. ప్రతి కార్యకర్తకు, ప్రతి ఒక్కరికీ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. పరీక్షలు, విద్యా వ్యవస్థ కోసం సాగించిన పోరాటంలో యువత సాధించిన ఈ విజయంతో ప్రారంభమైన ఉద్యమం రానున్న రోజుల్లో మరిన్ని విస్తృత మార్పులకు దారితీస్తుందని అఖిలేష్ యాదవ్ తన సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని చేతబూని ఇవిఎం, ఎన్నికల సంస్కరణల వరకు ఈ ఉద్యమం విస్తరిస్తుందని, బిజెపి ఎన్నికల కుంభకోణాలు, ఎంపిలు-ఎమ్మెల్యేల కొనుగోళ్ల వంటి ప్రతికూల రాజకీయాలకు తెరపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కమీషన్ల ద్వారా సాగే బిజెపి అవినీతి బట్టబయలవుతుందని, అధికార పక్షంతో కుమ్మక్కైన మీడియా ‘హ్యాండౌట్లు, పొగడ్తల పాటల’ సంబంధాలకు ముగింపు పలుకుతుందని పేర్కొన్నారు. బాధితులు, హింసకు గురైనవారు, అవమానానికి గురైనవారిపై ఇకపై బుల్డోజర్లు నడవవని, నిర్దోషులపై ఎన్‌కౌంటర్లు జరగవని ఆయన తెలిపారు. ‘‘ఇప్పుడు మార్పు తీసుకొచ్చే కొత్త శకం ఉదయిస్తుంది!’’ అని అఖిలేష్ యాదవ్ తన పోస్టులో తెలిపారు.
విద్యార్థి, యువజనులకు అభినందనలు :
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
జవాబుదారీతనం కోసం పోరాడి గెలిచిన విద్యార్థులకు,యువతకు భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) పొలిట్‌బ్యూరో అభినందనలు తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. పేపర్ లీక్‌ల కారణంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకర సంఘటనలపై జవాబుదారీతనం కోసం పోరాడిన దేశంలోని విద్యార్థులు, యువతకు అభినందనలు తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సాగిన లాఠీచార్జీలు, ఇతర అణచివేత చర్యలను ఎదుర్కొని కూడా వెనక్కి తగ్గకుండా, దేశ యువత ప్రదర్శించిన స్థిరమైన సంకల్పం, త్యాగాలు లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. యువత చూపిన ధైర్యం, దృఢ సంకల్పం భారత ప్రజాస్వామ్యానికి శుభసూచకం అని పొలిట్‌బ్యూరో పేర్కొంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను సిపిఎం స్వాగతించింది. అయితే దీని తర్వాత కూడా పేపర్ లీక్ అయ్యే అవకాశముందని, దీనికి ప్రధానంగా బాధ్యత వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. పరీక్షల వికేంద్రీకరణ చేయాలని సిపిఎం ప్రకటనలో పునరుద్ఘాటించింది. అలాగే, వాణిజ్యీకరణ, కేంద్రీకరణ, మతతత్వం ప్రధానంగా ఉన్న జాతీయ విద్యా విధానం-2020ని కూడా రద్దు చేయాలి. ఈ చర్యలు తీసుకోకపోతే, పేపర్ లీక్‌లు, వంచనల పరంపర కొనసాగుతుందని తెలిపింది. విద్యార్థి,యువజన ఉద్యమాలు తమ భవిష్యత్తు కోసం ఈ ప్రధానమైన డిమాండ్లను ప్రచారం చేసి, ఆందోళన చేస్తారని ఆశిస్తున్నామని సిపిఎం తెలిపింది.
ఓపెన్ సోర్స్‌పై మోడీ సర్కార్ అక్కసు
బిట్‌చాట్‌పై గుట్టుచప్పుడుగా నిషేధం
తీవ్రంగా ఖండించిన సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
బహుళ జాతి కార్పోరేట్ సంస్థలైన ఫేస్‌బుక్, వాట్సాప్, గూగుల్ వంటి అధిపతులతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉండే సామాజిక మాధ్యమాల స్వేచ్ఛను హరిస్తోంది. ఓపెన్ సోర్స్ పై అక్కసు వెళ్లగక్కుతోంది. ఈ క్రమంలోనే ఓపెన్ సోర్స్ మేసేజింగ్ అప్లికేషన్ బిట్‌చాట్ సంస్థపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిషేదం విధించింది. అయితే ఈ నిషేదం విధిస్తున్నట్లుగా బహిరంగంగా ప్రకటించకుండా గుట్టుచప్పుడుగా కేవలం ఆ సంస్థకు మాత్రమే తెలియజేసి భారత్‌లో మూసివేసింది. ఇది అప్రజాస్వామిక చర్య అని సీపీఎం పొలిట్‌బ్యూరో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్య హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుతంగా సంఘటితమై సంభాషించుకునే ప్రజల హక్కుపై చేస్తున్న దాడిగా పేర్కొంది. ఈ నిషేధం గురించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన, ఉత్తర్వు గానీ జారీ చేయకపోవడం మరింత ఆందోళనకరమని తెలిపింది. బిట్‌చాట్‌ను అభివృద్ధి చేసిన బృందానికి చెందిన జాక్ డోర్సీ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే కానీ..ఈ నిషేదం సంగతి బహిర్గతం కాలేదని తెలిపింది. పారదర్శకత లేదా ప్రజా జవాబుదారీతనం లేకుండా రహస్యంగా చేసిన ఈ నిషేధ నిర్ణయం రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య నియమాలకు పూర్తిగా విరుద్ధమని పొలిట్ బ్యూరో ఖండించింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) జారీ చేసిన ఉత్తర్వుల్లో తక్షణమే యాక్సెస్‌ను నిలిపివేయాలని ఆదేశించడమే కాకుండా, ఆ ప్లాట్‌ఫామ్‌పై శిక్షాత్మక పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని పొలిట్‌బ్యూరో వెల్లడించింది. నిజానికి కేంద్ర ప్రభుత్వ అభ్యంతరం చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై కాదని…దాని అభ్యంతరమంతా ఇంటర్నెట్ ఆంక్షలు విధించిన సమయంలోనూ బిట్‌ఛాట్ పనిచేయడంపైనే అని విమర్శించింది. అందుకనే ఆ సంస్థ గొంతు నులిమేశారని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినప్పుడల్లా, పౌరులకు బిట్‌ఛాట్ వంటి ఓపెన్ సోర్స్ వేదికలు సందేశాలు పంపుకోవడానికి వీలుకల్పిస్తున్నాయని, మోడీ సర్కార్‌కు కంటగింపుగా మారింది ఇదేనని పేర్కొంది. జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళన ఒక వైపు కొనసాగుతుండగా అంతులేని ఆంక్షలు విధించిన మోడీ సర్కార్ ఇంటర్నెట్ కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిట్‌ఛాట్ లాంటి సంస్థలను విద్యార్థులు వినియోగించుకునే వెసులుబాటు లేకుండా చేయాలని దానిపై నిషేధం విధించినట్లుగా కనిపిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో తెలిపింది.
పారదర్శకత లేదా సరైన ప్రక్రియ లేకుండా, ఓపెన్-సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను నిరోధించడానికి అస్పష్టమైన కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేయడం రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడమే కాకుండా, చట్టబద్ధ పాలనను మరింతగా బలహీనపరుస్తుందని తెలిపింది. బిట్‌చాట్‌ను నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వును తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఏకపక్షంగా నిలిపివేసిన చోటల్లా నిరంతరాయ ఇంటర్నెట్ కనెక్టివిటీని పునరుద్ధరించాలని, ఇలాంటి నిషేధం, ఇంటర్నెట్ షట్‌డౌన్ ఉత్తర్వులన్నింటినీ బహిరంగపర్చాలని, శాంతియుత నిరసన తెలిపే తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకుంటున్న విద్యార్థులు, యువతపై జరుగుతున్న వ్యవస్థీకృత అణచివేతకు ముగింపు పలకాలని పొలిట్ బ్యూరో ఆ ప్రకటనలో డిమాండ్ చేసింది. ఈ నిరంకుశ చర్యలను ప్రతిఘటిస్తున్న విద్యార్థులు, యువత, అన్ని ప్రజాస్వామ్య శక్తులకు సిపిఎం అండగా నిలుస్తుందని పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది. రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కులను హరించే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదని పొలిట్‌బ్యూరో పేర్కొంది.



