మీకిప్పటికే రాజేంద్రప్రసాద్ సినిమా గుర్తొచ్చి ఉంటుంది. క పలకలేక, పలికినా అది త అని వినిపిస్తుంటే హీరో పడే బాధలు తమాషాగా ఉంటాయి. ఒకరి అశక్తతని తమాషాకు చూపడం మానవులకు ఎప్పటినుండో అలవాటు. అది తప్పు అని తెలిసినా దాన్ని కొనసాగిస్తున్నారు జనాలు. అశక్తతను గుర్తించి నంతగా ఒకరి శక్తిని గుర్తించడంలో ఈ ప్రపంచం ఎప్పుడూ వెనకబడే ఉంటుంది. అదే జెన్ జీ చేసి చూపారు. ఉదయం లేచినప్పటినుండి వికసితమైన మాటలు మాట్లాడినా కాళ్లలో వణుకు పుట్టేలా చేసిన జెన్ జీ తెర మీద కనిపించినదానికంటే తెర వెనుక అందరినీ పరిగెత్తిస్తోంది. కమల్ సినిమా విక్రంలో ఒక పాత్ర విషయంలో భయం వేసినప్పుడు కాళ్ళు వణుకుతాయి, చెమటలు పడతాయి, అడుగులు తడబడుతాయి అని చెప్పడం చూస్తాం. తరువాత అది జరగడమూ చూస్తాం. ఇప్పుడు జెన్ జీ అష్ట దిగ్బంధనం చేసి చూపారు. శత్రువులు, అప్పులు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు అష్టదిగ్బంధనం జరిగిందని అలా యుద్ధంలో కూడా ఎనిమిదిదిక్కులా చుట్టేయాలని చెప్తారు.
బట్టలుతికే మా వాషింగ్ పౌడర్ అలా పనిచేస్తుందని, ఇలా పని చేస్తుందని ప్రకటనల్లో చూపిస్తారు. ఇప్పుడు దాని స్థానంలో ద్రవరూపంలో ఉన్నవి మొదలైనాయి. అన్నింటిలోనూ ఉన్న పదార్థం అదేనని చాలామందికి తెలీదు. ఇప్పుడలాగే జరిగింది.
పైకి మాత్రం దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని ఊదరగొడుతూ డైలాగులు చెప్పేవాళ్ళు వాస్తవానికొచ్చేసరికి వాళ్లకు నష్టం చేసి ఇప్పుడు నాలిక్కరు చుకుంటున్నారు. చాలామంది నోరు కూడా జారారు. అసలు నోరుజారడం వల్లే ఈ పరిస్థితులెర్పడ్డాయన్న విషయం గ్రహించాలి మొదట. అసలు వీళ్ల యూనివర్సిటీలు నడిపేది ఈ జెన్ జీలే. ఆలోచనలు వాళ్లిచ్చినా సాంకేతిక పరిజ్ఞానం మొత్తం యువతదే. తమతో చేయిస్తున్న మోసాలు తమకే నష్టం చేస్తున్నాయన్న విషయం వాళ్లకు తెలిసిపోయింది. అందుకే ఈ పరిణామాలు. ఆ నాయకుల పిల్లలే బొద్దింకల్లో కలిసిపోయి పోరాటాలు చేశారన్న విషయం, సహాయం చేశారన్న విషయం మరచిపోరాదు. టెక్నాలజీలోనే కాదు, పోరాటంలోనూ మేము ముందుటామని మొన్న జెన్ జీలు స్పష్టంగా తెలియ జేశారు. అలాగే జెన్ జీలు ఎక్కడ పోరాటం చేసినా నేడు లభ్యమౌతున్న అవకాశాలతో సహాయం నేరుగా వాళ్ళకు పంపిన జెన్ జీల త్యాగాన్ని, పట్టుదలను ఎవరు మరచిపోగలరు. పోలీసులే మా డ్రోన్లు మాకివ్వండని అడుక్కునే పరిస్థితి. చేయి పెట్టి బస్సునాపినా, ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీ గురిపెట్టినా, భాష్పవాయువులు, పెల్లెట్ గన్స్, వాటర్ గన్స్ ఇవేవీ ఆపలేదు వారిని.
ఆంధ్రకేసరి గురించి విన్నాము కాని ఇప్పుడు జెన్ జీలో కేసరులను చూస్తున్నాం. అడ్డు కావేవీ మేము చేయడానికని, కామేమీ మేము దేనికీ అనర్హమని నిరూపించి మెరిపించారు. అందుకే బొద్దింకలు, పరాన్న జీవులు అన్నోళ్లే వాళ్ల నాడి పట్టుకోవాలంటే వాళ్ల తరమే కావాలని జెన్ జీ చెప్పులు కొనుక్కొని మరీ వాటితో నడవడం ప్రాక్టీస్ చేస్తున్నారు. వావ్ జెన్ జీ ఏం భయం పెట్టారు. హ్యాట్సాఫ్ మీకు… ఇప్పుడు పాత జెన్ జీలు కొత్తగా జట్టుకడుతున్నారు. కొత్త సమీకరణాలు మొదలుపెడుతున్నారు. పాతోళ్లమైతేనేమి మేమూ ఒకప్పుడు జెన్ జీలమే అన్నట్టు దూకుడుగా ఉన్నారు. ఇంకోపక్క తల్లులకు, తండ్రులకు ఇబ్బంది తెప్పించే జెన్ జీలు కూడా తమ నోరు విప్పి చిక్కుల్లో పడవేస్తున్నారు. ఇది వైరివర్గాలకు మంచి టాపిక్కై పాత పగలు తీర్చుకోవడానికి టానిక్కై సహాయపడుతోంది. కాబట్టి జెన్ జీలు అన్ని రకాలుగా పనిచేస్తున్నట్టు అర్థమవుతోంది. అక్కడ ట్రంపులవారు, నెతన్యాహు, పుతిన్, కొరెట్స్కీ ఇలా ఇంకొంతమంది కూడా జెన్ జీ దీదే ఆశలు పెట్టుకున్నామని ఒక్కొక్కరి మీద ఒక్కోరకమైన ప్రేమ చూపుతున్నారు.
విదేశీ జెన్ జీ చదువులకు, ఉద్యోగాలకు వస్తే వాళ్ళమీద పన్నులేసి సంపాదిస్తున్నారు. జెన్ జిలతో యుద్ధాలు చేయిస్తున్నారు, స్త్రీ పురుష బేధాల్లేకుండా శత్రుదేశాల జెన్ జిలను చంపేస్తున్నారు, భవిష్యత్తు జెన్ జీలను నాశనం చేస్తున్నారు తల్లుల గర్భంలోనే. వీళ్ళంతా కూడా పైకి ధైర్యవచనాలు పలుకుతూ వంటసామాగ్రిలో దాక్కొని, సైనిక విమానాల్లో పారిపోవడం ప్రపంచానికి తెలిసిపోయింది. ఇవన్నీ కూడా జెన్ జీ చూస్తోందన్న విషయం వాళ్లు కండ్లు మూసుకొని పాలుతాగే పిల్లిలాగా, ఇంకో ప్రాణిని చంపి తినేటప్పుడు మొసలి కన్నీరు కార్చుకుంటూ తింటుందంటారు అలా చేస్తున్నారు వాస్తవంలో. చూస్తుంటే నాయకుల మెదళ్లలో కూడా పదార్థం ఒకటే ఉన్నట్టుంది.అమెరికాకు పక్కలో బల్లెమై నీకు నేనెంతదూరమో నాకూ నువ్వంతే దూరమని ధైర్యంగా సవాలు విసిరిన క్యూబా నేత ఫెడల్ కాస్ట్రో శతజయంతి కూడా జరుగుతోంది. ఆ స్ఫూర్తి అజరామరం. అప్పుడు ఈ పేర్లు లేవుగాని జెన్ జీలైన చే, రావుల్ కాస్ట్రో ఇతర జట్టుతో తమ పవరేంటో చూపించిన ఫెడల్, చే ఎప్పుడూ జెన్ జీలకు ఆదర్శమే.మార్క్సు మహనీయుడు ‘ప్రపంచ కార్మికు లారా ఏకంకండి’ అన్నట్టు ప్రపంచ జెన్ జీలారా ఏకం కండి అని చెప్పే అవసరం లేకుండానే వాళ్లు ఏకమయ్యారు, అవుతున్నారు. తస్మాస్…..
జంధ్యాల రఘుబాబు 9849753298



