– శిక్షణ శిబిరాన్ని సందర్శించిన సీఎస్ఎఫ్ బృందం సభ్యులు అజయ్
– పిల్లల్లో సామర్థ్యాల పెంపే లక్ష్యం
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యార్థుల మానసిక స్థితి, అభ్యాస స్థాయికి అనుగుణంగా బోధన అందించి వారి సామర్థ్యాలను పెంపొందించడమే ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ ప్రధాన లక్ష్యమని సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ బృందం (సీఎస్ఎఫ్) సభ్యుడు అజయ్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గత ఆరు రోజులుగా నిర్వహించిన ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ సోమవారంతో ముగిసింది. శిక్షణ చివరి రోజు సీఎస్ఎఫ్ సభ్యుడు అజయ్ శిబిరాన్ని సందర్శించి శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రెమిడియేషన్ శిక్షణలో నేర్చుకున్న పద్ధతులను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేసి, ప్రతి విద్యార్థి అభ్యాస లోపాలను గుర్తించి వారి సామర్థ్యాల పెంపుదలకు కృషి చేయాలని సూచించారు.
మండల విద్యాధికారి ప్రసాదరావు మాట్లాడుతూ..శిక్షణలో పొందిన నైపుణ్యాలను పాఠశాలల్లో ఆచరణలో పెట్టి విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థిని ఉత్తమ స్థాయికి తీసుకెళ్లే దిశగా అంకితభావంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శిక్షణ నిర్వాహకులు, విద్యాశాఖ అధికారులు, రిసోర్స్ పర్సన్లు, మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



