సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
జయప్రదం చేయాలని పిలుపు..రైతు సంఘం జాతీయ మహాసభల ప్రచారంలో భాగంగా విరాళాల సేకరణ
నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్
నేటి కేంద్ర, రాష్ట్ర పాలకులు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ స్వాతంత్రోద్య మ కాలంలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈనెల 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమా న్ని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. నవంబర్‌లో నిర్వహించనున్న రైతు సంఘం జాతీయ మహాసభల ప్రచారంలో భాగంగా ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామంలో రైతులను కలిసి మహాసభలకు కావలసిన విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిన తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని, ఆ స్పూర్తితో పాలకుల విధానాలపై ఎప్పటికప్పుడు సీపీఐ(ఎం) రాజీలేని పోరాటాలు
చేస్తున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దివాళా కోరు విధానాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు చేతిలోని భూమిని కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారనీ, వీటికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆరుగాలాలు కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుండా జరుగుతున్న అన్యాయాన్ని పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
పైగా విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ మీటర్లను బిగించి రైతులు కరెంటు బిల్లు చెల్లించే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారని అన్నారు. రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, సామాన్య, మధ్యతరగతి ప్రజలు దుర్భర జీవనం గడిపే స్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రైతులు పడుతున్న కష్టాలను సమీక్షించి వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన ఉద్యమాలపై నవంబర్ 19 నుంచి నల్లగొండలో నిర్వహించనున్న జాతీయ రైతు సంఘం మహాసభలో చర్చించనున్నట్టు తెలిపారు. జాతీయస్థాయి మహాసభలకు రైతులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు మద్దతిచ్చి జయప్రదం చేయడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి రవి నాయక్, సభ్యులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.



