మూడు వారాల్లో రెండోసారి బ్లాక్ చేసిన కేంద్రం
కంటెంట్ తొలగించాలంటూ 5 నెలల్లో 2 లక్షల ఉత్తర్వులు
న్యూఢిల్లీ : ప్రముఖ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కేంద్ర ప్రభుత్వం గత మూడు వారాల్లో రెండోసారి బ్లాక్ చేసింది. మంగళవారం తన ఖాతాను అధికారులు నిలిపివేసినట్టు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘మోడీ ప్రభుత్వం భారతదేశంలో నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఈ ఏడాది సెప్టెంబర్ 28 నుంచి ఒక వారం రోజుల పాటు నిలిపివేసింది. ఆ తర్వాత అక్టోబర్ 20 (మంగళవారం)న మళ్లీ నిలిపివేసింది. పొలిటికల్ కార్టూన్లను చూసి భయపడటం మానేసేంత వరకు, ఈ 'నిరసన ఫ్రేమ్' అలాగే కొనసాగుతుంది.’ అని ఆ పోస్టులో సతీష్ ఆచార్య పేర్కొన్నారు. ఆయన ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ లో “భారతదేశ సమాచార సాంకేతిక మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నీతి నియ మావళి నిబంధనల ప్రకారం చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా ఈ ఖాతాకు ప్రాప్యతను తాత్కాలికంగా పరిమితం చేశాం” అనే మెసేజ్ వస్తోంది. తొలిసారి సెప్టెబర్ 28న ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేసిన కేంద్రం అక్టోబర్ 5న పునరుద్ధరించింది. “సాహెబ్, మంచి రోజులు తీసుకురావడానికే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను బ్లాక్ చేస్తూ మీరు మీ పదవీకాలాన్ని వృధా చేస్తున్నారు!” అని అప్పట్లో సతీష్ ఆచార్య పోస్టు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలపై ఢిల్లీ పోలీసుల అమా నుష దాడులు, ఒక హత్య కేసు సిబిఐ దర్యాప్తు జరుపు తుండగానే బిజెపి నాయకుడు దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించడం, ఎన్నికల కమిషన్ పనితీరుపైనా, ఓటర్ల జాబితా సవరణలో అవకతవకలపై, ప్రతిపక్షాలు, వామపక్షాలు, సిజెపి నిరసనలు తదితర అంశాలపై సతీష్ ఆచార్య వేసిన కార్టూన్లు చర్చనీయాంశమయ్యాయి.
కంటెంట్ తొలగింపుపై 2 లక్షలకుపైగా ఉత్తర్వులు
మార్చి నుంచి జులై మధ్య కాలంలో కంటెంట్‌ను తొలగించాలని ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లకు దాదాపు రెండు లక్షల ఉత్తర్వులు జారీ చేసింది. అంటే దాదాపు ప్రతిరోజూ 1,275 ఉత్తర్వులను జారీ చేస్తుందన్న మాట. ప్రతి బ్లాకింగ్ ఉత్తర్వు వందలాది వ్యక్తిగత పోస్టులు, కంటెంట్ లేదా ఖాతాలపై చర్యలకు ఆదేశించవచ్చు. బ్లాకింగ్ నోటీసులను పంపేందుకు వీలు కల్పించే సహ్యోగ్ పోర్టల్ ద్వారా, అక్టోబర్ 2024 నుండి అక్టోబర్ 2025 మధ్య 19 ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లకు 2,312 బ్లాకింగ్ ఉత్తర్వులు పంపబడ్డాయని సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) రికార్డులు వెల్లడించినట్లు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పేర్కొంది. ఈ పోర్టల్ ద్వారానే చాలా వరకు బ్లాకింగ్ ఉత్తర్వులను కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు జారీ చేశాయని ఆ పత్రిక నివేదించింది. ఇన్‌స్టాగ్రామ్‌కు అత్యధికంగా దాదాపు 1 లక్ష బ్లాకింగ్ ఉత్తర్వులు అందాయి. ఫేస్‌బుక్‌కు 80,000, యూట్యూబ్‌కు దాదాపు 15,000 ఆదేశాలు వచ్చాయి.




కామెంట్‌లు (0)