పర్యావరణ విధ్వంసానికి కేంద్రం ద్వంద్వ విధానాలే కారణం : సీపీఐ(ఎం) ఎంపీ వి. శివదాసన్
ఆదివాసీలు, స్థానిక ప్రజల హక్కులు కాపాడాలి
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
జార్ఖండ్‌లోని అశోక్ బొగ్గు గని విస్తరణ ప్రాజెక్టుకు ఇచ్చినట్లు వెల్లడవుతున్న ప్రాథమిక అటవీ అనుమతులను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యులు వి. శివదాసన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు అమలైతే భారీ స్థాయిలో పర్యావరణ విధ్వంసంతో పాటు ఆదివాసీలు, అటవీ ప్రాంతాలపై ఆధారపడి జీవిస్తున్న స్థానిక ప్రజల హక్కులు, జీవనోపాధి ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం 928.03 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించాల్సి ఉంటుందని, దీనివల్ల దాదాపు 5.67 లక్షల చెట్లు నరికివేతకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. వీటిలో 2.43 లక్షల సాల్ వృక్షాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా వన్యప్రాణుల ఆవాసాలు, ఏనుగుల సంచార మార్గాలు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు.
పర్యావరణ పరిరక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని శివదాసన్ విమర్శించారు. పశ్చిమ కనుమల పర్యావరణ సున్నిత ప్రాంతాల (ఈఎస్‌ఏ) తాజా ముసాయిదా నోటిఫికేషన్ పేరుతో లక్షలాది మంది ఆదివాసీలు, సంప్రదాయ అటవీ నివాసులపై ఆంక్షలు విధించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం, మరోవైపు వాణిజ్య ప్రయోజనాల కోసం భారీ స్థాయిలో అడవులను ధ్వంసం చేసే బొగ్గు గనుల విస్తరణకు అనుమతులు ఇవ్వడానికి ఎందుకు సిద్ధమవుతోందని ప్రశ్నించారు.
పర్యావరణ పరిరక్షణ పేరుతో ఆదివాసీలు, సంప్రదాయ అటవీ సమాజాలపై ఆంక్షలు విధిస్తూ, కార్పొరేట్ సంస్థలకు మాత్రం అడవులను నాశనం చేసుకునే అవకాశం ఎలా కల్పిస్తారని నిలదీశారు. సామాన్య ప్రజలకు ఒక నిబంధన, కార్పొరేట్ సంస్థలకు మరో నిబంధన ఉండకూడదని స్పష్టం చేశారు.ఇలాంటి విధానాలు జీవవైవిధ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, 2006 అటవీ హక్కుల చట్టం ద్వారా రక్షణ పొందుతున్న అటవీ ఆధారిత సమాజాల హక్కులను కాలరాస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలోని అడవులు జాతీయ పర్యావరణ సంపద మాత్రమే కాదని, లక్షలాది మంది ఆదివాసీలు, అటవీ ఆధారిత ప్రజల సంప్రదాయ నివాస ప్రాంతాలని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థల లాభాల కోసం వారి భూములు, జీవనోపాధిని బలిచేయడం తగదన్నారు. అశోక్ బొగ్గు గని విస్తరణకు ప్రతిపాదించిన అటవీ అనుమతులను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రాజెక్టు పర్యావరణ, సామాజిక ప్రభావాలపై స్వతంత్ర సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య కేవలం జార్ఖండ్‌కు మాత్రమే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా పర్యావరణ న్యాయం, అటవీ సంరక్షణ, సంప్రదాయ సమాజాల హక్కులకు సంబంధించిన కీలక అంశమని శివదాసన్ పేర్కొన్నారు.






కామెంట్‌లు (0)