Magazines

యాప్‌ గుప్పెట్లో గిగ్‌ కార్మికులు

16 నిమిషాల క్రితం

Gig workers in the grip of apps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 5 నిమిషాల చదవడం

మోడీ పాలనలో వారికి హామీ కరువు

డిజిటల్‌ ఇండియా ప్రచారం ఘనం..

కార్మికుల సంక్షేమం శూన్యం

కార్పొరేట్లకు కాసుల పంట.. కార్మికులకు కష్టాల వాత

వారానికి 70 గంటలకు పైగా శ్రమిస్తున్న 23 శాతం మంది

కార్మిక చట్టాలున్నా హక్కులకు భరోసా లేదు

ఆదాయం తగ్గితే అప్పులే దిక్కు.. పట్టించుకోని వ్యవస్థ

ఒకవైపు డిజిటల్‌ ఇండియా, మరోవైపు కార్పొరేట్‌ ఇండియా! ఒకవైపు కొత్త ఉపాధి అవకాశాలంటూ మోడీ సర్కారు ప్రచార హోరు.. మరోవైపు అదే ఉపాధి పేరుతో కార్మికుల జీవితాలను యాప్‌లు శాసిస్తున్న దుస్థితి! పని గంటల్లో స్వేచ్ఛ ఉంటుందని నమ్మించి రంగంలోకి దింపుతున్న సంస్థలు.. ఇప్పుడు ఎప్పుడు పనిచేయాలి, ఏ పని చేయాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలన్నదీ పరోక్షంగా నిర్ణయిస్తున్నాయి. ఎండలు మండుతున్నా, వర్షాలు ముంచెత్తుతున్నా విధులకు వెళ్లాల్సిందే. బుకింగ్‌ తిరస్కరిస్తే ఆదాయానికి కోత.. యాప్‌ సేవలు నిలిపివేస్తే ఉపాధికే గండి. కార్పొరేట్లకు అనుకూలమైన ఆర్థిక విధానాలను ముందుకు తీసుకెళ్తున్న మోడీ ప్రభుత్వ హయాంలో.. వారి వ్యాపారాలకు వెన్నెముకగా నిలుస్తున్న కార్మికులకు కనీస రక్షణ ఎందుకు దక్కడం లేదన్న ప్రశ్న ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తోంది.

న్యూఢిల్లీ : డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను దేశాభివృద్ధికి చిహ్నంగా చూపుతున్న మోడీ ప్రభుత్వం.. ఆ వ్యవస్థను నడిపిస్తున్న కార్మికుల దుస్థితికి ఏం సమాధానం చెప్తుంది? యాప్‌ల ద్వారా సేవలు అందించే గిగ్‌ కార్మికుల సంఖ్య పెరుగుతున్నా.. వారి పని పరిస్థితులు మాత్రం మెరుగుపడటం లేదు. ఉపాధి కల్పనను విజయంగా ప్రచారం చేసుకోవడం సులువే. కానీ ఆ ఉపాధిలో పనిచేసేవారికి గౌరవప్రదమైన వేతనం, విశ్రాంతి, ఆరోగ్య భద్రత, సామాజిక భరోసా కల్పించాల్సిన బాధ్యత నుంచి మాత్రం ప్రభుత్వం తప్పించుకుంటోంది. కార్పొరేట్‌ సంస్థల వ్యాపార విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్న మోడీ ప్రభుత్వం.. కార్మికుల హక్కుల విషయంలో మాత్రం అదే వేగం చూపడం లేదన్నది కీలక విమర్శగా మిగిలింది.

యాప్‌ చెప్పిందే పని.. లేదంటే ఉపాధికి ఎసరు!

హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన 43 ఏండ్ల గంగా (పేరు మార్చాం) అర్బన్‌ కంపెనీతో అనుబంధంగా పనిచేస్తున్నారు. పని వేళల్లో స్వేచ్ఛ, మంచి ఆదాయం లభిస్తాయన్న ఆశతో ఈ రంగంలోకి వచ్చిన ఆమె ఇప్పుడు రోజుకు 6 నుంచి 12 గంటలపాటు పనిచేస్తున్నారు. వారాంతాల్లోనూ విధులకు వెళ్లాల్సి వస్తోంది. నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు సంపాదిస్తున్నప్పటికీ.. బుకింగ్‌లను రద్దు చేసుకునే విషయంలో సంస్థ విధిస్తున్న పరిమితులు ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

28 రోజుల్లో నాలుగు బుకింగ్‌లను మాత్రమే రద్దు చేసుకోవచ్చనీ, పరిమితి దాటితే మళ్లీ శిక్షణకు పంపడం లేదా కొన్ని రోజులపాటు యాప్‌ వినియోగాన్ని నిలిపివేయడం జరుగు తుందని ఆమె తెలిపారు. గతంలో పని చేయాలా వద్దా అనేది తామే నిర్ణయించుకునేవారమనీ, ఇప్పుడు బుకింగ్‌లు ఆటోమేటిక్‌గా కేటాయిస్తున్నారని చెప్పారు. భారీ వర్షాల సమయంలోనూ బుకింగ్‌ రద్దుకు తగిన సహకారం లభించలేదని వివరించారు. స్వేచ్ఛాయుత ఉపాధి పేరుతో ప్రచారం జరుగుతున్నా.. ఆచరణలో కార్మికులపై నియంత్రణ పెరుగుతోందనేందుకు ఈ ఉదంతం అద్దం పడుతోంది.

కార్మిక చట్టాలు.. కాగితాలకే పరిమితమా?

మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాల వ్యవస్థలో గిగ్‌ కార్మికుల హక్కులకు సంబంధించి కీలకమైన లోటుపాట్లు ఉన్నాయి. సామాజిక భద్రతా కోడ్‌-2020లో వీరికి గుర్తింపు కల్పించినప్పటికీ.. వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రత, పని పరిస్థితులకు సంబంధించిన కోడ్‌-2020లో స్పష్టమైన రక్షణలు లేవు. సంప్రదాయ ఉద్యోగులుగా గుర్తింపు లేకపోవడంతో పని గంటలు, విశ్రాంతి విరామాలు, ఓవర్‌టైమ్‌ చెల్లింపులు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి అంశాలపై హక్కులు సాధించడం కష్టమవుతోంది. జన్‌పహల్‌ సంస్థ ఈ ఏడాది సెప్టెంబరులో పది నగరాల్లో వెయ్యి మంది ప్లాట్‌ఫామ్‌ కార్మికులపై నిర్వహించిన సర్వే ప్రకారం.. 57 శాతం మంది వారానికి 49 గంటలకు పైగా పనిచేస్తున్నారు. 23 శాతం మంది వారానికి 70 గంటలకు మించి శ్రమిస్తున్నారు. హీట్‌వాచ్‌ నివేదిక ప్రకారం.. వేసవిలో సర్వేలో పాల్గొన్న మహిళా కార్మికుల్లో 71 శాతం మంది వారంలో ఏడు రోజులూ పనిచేశారు. 65 శాతం మందికి పనిదినంలో ఒక్కసారి మాత్రమే విరామం లభించడం లేదా అసలు విరామమే లేదు. ఈ గణాంకాలు పని ఒత్తిడిని మాత్రమే కాదు.. కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామనే ప్రభుత్వాల వాదనను కూడా ప్రశ్నిస్తున్నాయి. కార్మికుల శ్రమను వినియోగించుకునే సంస్థలకు వ్యాపార స్వేచ్ఛ ఉండాలి.. కానీ కార్మికులకు విశ్రాంతి, భద్రత, న్యాయమైన ఆదాయం ఉండకూడదా? అభివృద్ధి అంటే సంస్థల లాభాలు పెరగడమేనా? కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడకపోతే ఆ అభివృద్ధి ప్రయోజనం ఎవరికి దక్కుతున్నట్టు? అనే ప్రశ్నలను యూనియన్లు సంధిస్తున్నాయి.

కార్పొరేట్ల లాభాలే అభివృద్ధికి కొలమానమా?

అర్బన్‌ కంపెనీ అక్టోబర్‌ 12న తన సేవా భాగస్వాముల ఆదాయం, కమిషన్లు, జరిమానాలకు సంబంధించి కొత్త మార్పులను ప్రకటించింది. అయినప్పటికీ కార్మికులకు సురక్షితమైన పని పరిస్థితులు, విశ్రాంతి కేంద్రాలు, తాగునీరు, మరుగుదొడ్లు కల్పించాల్సిన అవసరం కొనసాగుతోంది. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం, కొత్త ఉపాధి అవకాశాలు రావడం దేశానికి అవసరమే. కానీ ఆ వృద్ధికి పునాదిగా ఉన్న కార్మికుల హక్కులను విస్మరిస్తే, అభివృద్ధి ఫలాలు ఎవరికి దక్కుతున్నాయన్న ప్రశ్న తప్పదని యూనియన్లు హెచ్చరిస్తున్నాయి. కార్పొరేట్‌ సంస్థలకు వ్యాపార అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ బాధ్యత కాదనీ, వాటి ద్వారా పనిచేసే కార్మికులకు న్యాయమైన వేతనం, పని గంటల పరిమితి, ఆరోగ్య భద్రత, సామాజిక భరోసా కల్పించడం కూడా అంతే ముఖ్యమని చెప్తున్నారు. ''డిజిటల్‌ ఇండియా నినాదాలు కార్మికుల కడుపు నింపవు. కార్పొరేట్‌ సంస్థల వృద్ధి వారి కుటుంబాలకు భద్రత ఇవ్వదు. ఆ భరోసా రావా లంటే చట్టాలు అమలుకావాలి.. హక్కులకు రక్షణ ఉండాలి.. కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలి. ఈ బాధ్యత నుంచి మోడీ ప్రభుత్వం తప్పించుకోలేదు'' అంటూ గిగ్‌ కార్మికుల పరిస్థితిపై యూనియన్లు హెచ్చరిస్తున్నాయి.

ఎండల్లో ప్రాణాలు పణంగా.. ఆదాయం కోసం అప్పులు

తీవ్రమైన ఎండలు కార్మికుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. జన్‌పహల్‌ సర్వేలో 75.5 శాతం మంది ఎండ తీవ్రత తమ పనితీరు, భద్రతపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని తెలిపారు. సగం మంది డీహైడ్రేషన్‌కు గురికాగా, 62 శాతం మంది వడదెబ్బకు ముందు కనిపించే తీవ్ర అలసట వంటి లక్షణాలను ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లో 2024లో 166 మంది గిగ్‌ కార్మికులపై నిర్వహించిన సర్వేలో 40 శాతం మందికి పనిచేసే సమయంలో శుభ్రమైన, చల్లని తాగునీరు అందుబాటులో లేదని తేలింది. 60 శాతానికి పైగా మందికి శుభ్రమైన మరుగుదొడ్లు లేవు. 80 శాతానికి పైగా మందికి విశ్రాంతి తీసుకోవడానికి నీడ లేదా చల్లదనం కల్పించే సదుపాయాలు లేవు. కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేని పరిస్థితుల్లో కార్మికులు పనిచేయాల్సి వస్తుండటం వ్యవస్థలోని నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది.

ఇదేనా కార్మికుల సంక్షేమం?

వడగాలుల నుంచి కార్మికులను రక్షించేందుకు గతేడాది జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ పలు సూచనలు చేసింది. వాతావరణ శాఖ ఆరెంజ్‌, రెడ్‌ హెచ్చరికలు జారీ చేసిన ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య తప్పనిసరి పనిని నిలిపివేయడం, విశ్రాంతి విరామాలు కల్పిం చడం, శిక్షలు లేకుండా విధుల నుంచి తప్పుకునే అవకాశం ఇవ్వడం వంటివి అందులో ఉన్నాయి. అయితే, ఇవి తప్పనిసరిగా అమలు చేయాల్సిన నిబంధనలు కాకపోవడంతో ఎండల్లో పనిచేయలేని కార్మికులు ఆరోగ్యాన్ని పణంగా పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో పనిచేయకపోతే వారు తమ ఆదాయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడు తున్నాయి. ఇదేనా మోడీ పాలనలో కార్మిక సంక్షేమం? అంటూ కార్మిక నాయకులు ప్రశ్నిస్తున్నారు.

సామాజిక భద్రతపై హామీలే.. అమలు ఏదీ?

తెలంగాణ, కర్నాటక, జార్ఖండ్‌, బీహార్‌, రాజస్తాన్‌ రాష్ట్రాలు గిగ్‌ కార్మికుల కోసం చట్టాలు తీసుకొచ్చాయి. అయినప్పటికీ గరిష్ఠ పని గంటలు, విశ్రాంతి, ఓవర్‌టైమ్‌, ఎండల నుంచి రక్షణ వంటి అంశాలపై స్పష్టమైన నిబంధనలు పరిమితంగానే ఉన్నాయి. కనీస వేతనం ఎలా నిర్ణయించాలి? యాప్‌లో పని కోసం వేచి ఉండే సమయానికి చెల్లింపులు ఉండాలా? సంస్థలు ఎంత మొత్తాన్ని కార్మికులకు చెల్లిం చాలి? వంటి ప్రశ్నలకు స్పష్టత కొరవడింది. సామాజిక భద్రతా కోడ్‌ కింద గిగ్‌ కార్మికుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ.. పథకాల అమలు ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంది. ఈఎస్‌ఐ పరిధిలోకి వీరిని తీసుకొచ్చే ప్రతిపాదన ఇంకా రూపకల్పన దశలోనే ఉందని సంబంధిత అధికారి తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్లాట్‌ఫామ్‌ కార్మికుల హక్కులపై తొలి అంతర్జాతీయ కార్మిక ప్రమాణాన్ని ఆమోదించినప్పుడు భారత్‌ ఓటింగ్‌కు దూరంగా ఉండటం గమనార్హం. కార్మికుల హక్కుల విషయంలో అంతర్జాతీయ స్థాయిలో కీలక నిర్ణయం తీసుకుంటున్న సమయంలో భారత్‌ ఓటింగ్‌కు దూరంగా ఉండటం కూడా చర్చనీయాంశమే. ఇది కార్మికుల సంక్షేమంపై కేంద్రం నిర్లక్ష్యపూరిత వైఖరికి నిదర్శనంగా యూనియన్‌ నాయకులు చెప్తున్నారు.

71 శాతం మంది కార్మికులకు ఇబ్బందులు

హీట్‌వాచ్‌ నివేదిక ప్రకారం... వేసవిలో ఆదాయం తగ్గడంతో 71 శాతం మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. 89 శాతం మంది అప్పులు చేయడం, చెల్లింపులు వాయిదా వేయడం లేదా కుటుంబ ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా పరిస్థితిని ఎదుర్కొన్నారు. 74 శాతం మందికి ఎండల ప్రభావం నుంచి ఉపశమనం కల్పించే సహాయం సంస్థల నుంచి అందలేదు. ఆదాయం తగ్గినప్పుడు ఆదుకునే వ్యవస్థ లేకపోవడం, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు భరోసా కొరవడటం.. ఇవన్నీ అసంఘటిత ఉపాధిలో కార్మికులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్