Magazines

బీహార్ నదిలో పడవ బోల్తా

1 రోజు క్రితం

Boat capsizes in Bihar river
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 2 నిమిషాల చదవడం

చిన్నారులు సహా 14 మంది మృతి

పాట్నా : బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. వైశాలి జిల్లాలోని రఘోపుర్ దియారా ప్రాంతంలో గంగా నదిలో పడవ బోల్తాపడటంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలే ఉన్నట్టు సమాచారం. పడవలో ప్రయాణిస్తున్న మరికొందరు గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు.

వైశాలి జిల్లాలోని రఘోపుర్ దియారా ప్రాంతానికి చెందిన కొందరు గ్రామస్థులు ఓ విందులో పాల్గొనేందుకు పడవలో వెళ్లారు. తిరిగి వస్తుండగా శ్యామ్‌చంద్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న పడవ నదిలో బోల్తాపడటంతో అందులో ఉన్నవారు నీటిలో పడిపోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల కురిసిన వర్షాలు, ఉపనది గండక్‌లో వరదల కారణంగా గంగా నదిలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో పడవ ప్రమాదానికి గురైంది. అనంతరం పడవలోని కొందరు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే మరికొందరు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు గల్లంతయ్యారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న జిల్లా అధికారులు వెంటనే స్పందించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టేందుకు జిల్లా పోలీసు అధికారులు, రాష్ట్ర విపత్తు స్పందన దళం ( ఎస్ డీఆర్ఎఫ్) బృందాన్ని పంపినట్లు వైశాలి జిల్లా మేజిస్ట్రేట్ వర్షా సింగ్ తెలిపారు. ఆమెతోపాటు జిల్లా ఎస్పీ శుభాంక్ మిశ్రా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

గల్లంతైన వారి కోసం గాలింపు

పడవ ప్రమాదం నుంచి బయటపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వారిని అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం అధికారులు, సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని అన్నారు. పడవ ప్రమాదం జరిగిన సమయంలో అందులో సుమారు 30 మంది ఉన్నట్లు మహువా మాజీ ఎమ్మెల్యే ముఖేశ్ రౌషన్ తెలిపారు. వారిలో ఏడెనిమిది మంది మాత్రమే ఈదుకుంటూ సురక్షితంగా బయటపడగలిగారని చెప్పారు. సుమారు 12 మంది మరణించగా, మిగిలినవారు గల్లంతైనట్టు ఆయన పేర్కొన్నారు. అయితే అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 14కు చేరింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్