Magazines

ఈవీలకు జోష్‌.. గ్రిడ్‌కు షాక్‌

58 నిమిషాల క్రితం

Boost for EVs
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 2 నిమిషాల చదవడం

పెరుగుతున్న విద్యుత్‌
 వాహనాల డిమాండ్‌

చార్జింగ్‌ మౌలిక వసతులు మాత్రం అంతంతే

అపార్ట్‌మెంట్‌లలో 
అనేక ఇబ్బందులు

ట్రాన్స్‌ఫార్మర్లు, డిస్కమ్‌లు,
 గ్రిడ్‌పై పెరుగుతున్న ఒత్తిడి

ప్రభుత్వాలు దృష్టి 
పెట్టాలంటున్న పరిశ్రమ వర్గాలు


పెట్రోల్‌, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించేలా విద్యుత్‌ వాహనాల వైపు భారత్‌ అడుగులు వేస్తోంది. కానీ దేశంలో ఈ మార్పునకు అవసరమైన విద్యుత్‌ గ్రిడ్‌, చార్జింగ్‌ కేంద్రాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, నిల్వ వ్యవస్థలు అదే స్థాయిలో సిద్ధంగా ఉన్నాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈవీలను ప్రోత్సహించడంలో ముందున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. వాటికి అవసరమైన మౌలిక వసతులపై కూడా అంతే వేగంగా దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


న్యూఢిల్లీ : భారత్‌లో విద్యుత్‌ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. కార్లే కాదు.. ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు, బస్సులు, ట్రక్కులు కూడా క్రమంగా విద్యుత్‌ వైపు మళ్లుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, అంతర్జాతీయ పరిణామాలు, ముడిచమురు సరఫరాపై అనిశ్చితి వంటి కారణాలతో ఈ మార్పు మరింత వేగం పుంజుకుంటోంది. భారత్‌లో కొత్త కార్ల అమ్మకాల్లో ఈవీల వాటా 10 శాతానికి చేరువైంది. దేశంలో అతిపెద్ద ఈవీ తయారీదారుల్లో ఒకటైన టాటా మోటార్స్‌ ప్రతినిధులు చెప్పినట్టుగా మార్కెట్లో డిమాండ్‌ సరఫరా కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉంది. యూరప్‌లోనూ బ్యాటరీ ఆధారిత విద్యుత్‌ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. చార్జింగ్‌ అసలు సమస్య ఈవీలు కలిగి ఉన్న అపార్ట్‌మెంట్‌లలో చార్జింగ్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. సొంత ఇంట్లో ఉండేవారికి ఈవీ చార్జింగ్‌ కొంత సులభమైనా.. అపార్ట్‌మెంట్లలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఒక్కో ఫ్లాట్‌కు ప్రత్యేక చార్జర్‌ ఏర్పాటు చేయాలంటే భవనం మొత్తం విద్యుత్‌ లోడ్‌ పెరుగుతుంది.

దీంతో రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, స్థానిక అధికారులు, విద్యుత్‌ సంస్థల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. దేశంలోని పలు నగరాల్లో ఈ సమస్యలు కనిపిస్తున్నాయి. ఇక కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ పెడితే భారీ ఖర్చు. ఒక అపార్ట్‌మెంట్‌ కోసం రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేసి కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయడం సాధ్యం కాని విషయం. అందుకే అందుబాటులో ఉన్న విద్యుత్‌ను బట్టి చార్జింగ్‌ వేగాన్ని నియంత్రించే లోడ్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థలు అవసరమవుతున్నాయి. గ్రిడ్‌పై పెరుగుతున్న భారం ఇది కేవలం చార్జింగ్‌ కేంద్రాల సమస్య కాదు. కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ ఇప్పటికే ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పాత గ్రిడ్‌ మౌలిక వసతులు, పరిమిత ట్రాన్స్‌ఫార్మర్లు, డిస్కమ్‌ల ఆర్థిక ఇబ్బందులు ఈవీల విస్తరణకు అడ్డంకులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈవీల సంఖ్య పెంచడం మాత్రమే సరిపోదు. వాటికి అవసరమైన విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థను కూడా ముందుగానే బలోపేతం చేయాలి.

రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతోపాటు సౌర, పవన విద్యుత్‌ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను వేగంగా పెంచాలి. విద్యుత్‌ను నిల్వ చేసే బ్యాటరీ వ్యవస్థలపైనా పెట్టుబడులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ముందుచూపు అవసరం ఈవీలను ప్రోత్సహించడం ద్వారా పెట్రోల్‌, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. రవాణా ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా బస్సులు, వాణిజ్య వాహనాలను విద్యుత్‌ వైపు మళ్లిస్తే నిర్వహణ వ్యయాలు తగ్గవచ్చని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ మార్పునకు అవసరమైన మౌలిక వసతులు సిద్ధంగా లేకపోతే.. ఈవీ విప్లవం వినియోగదారులకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీల అమ్మకాలపై మాత్రమే కాకుండా.. చార్జింగ్‌ నెట్‌వర్క్‌, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ గ్రిడ్‌, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్‌ నిల్వ వ్యవస్థలపై సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు, మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్