Magazines

సీజేపీ నేతలు విడుద‌ల‌

59 నిమిషాల క్రితం

CJP leaders released
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు బెయిల్ మంజూరు

​నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జాతీయ క‌న్వీన‌ర్‌ అభిజీత్ దీప్కే, కో క‌న్వీన‌ర్లు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకాలను ఢిల్లీ పోలీసులు నిర్బంధం నుంచి విడుదల చేశారు. ఆదివారం ఉదయం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఏడాది పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడకూడదనే షరతుతో వారిని విడుదల చేశారు. ఈ ముగ్గురు నాయకులు శనివారం అక్టోబర్‌ 10న ముంబయి నుంచి ఢిల్లీకి విమానంలో చేరుకున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించతలపెట్టిన నిరసనలో పాల్గొనేందుకు వారు ఢిల్లీ వచ్చారు. అయితే, విమానం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన వెంటనే పోలీసులు అందులోకి ప్రవేశించి, వారు బయటకు రాకముందే అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ ప్రతిపాదించిన నిరసన ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. నిరసనకారులు జంతర్‌ మంతర్‌కు చేరుకోకుండా రాజధాని అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే ముగ్గురు నాయకులను నిర్బంధించారు.


​మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు ​
ఆదివారం ఉదయం అభిజీత్ దీప్కే, సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకాలను ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ సన్మిత్ర ఎదుట హాజరుపరిచారు. ఏడాది పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడబోమనే షరతుతో కూడిన నిర్దిష్ట నమూనా బాండ్‌పై సంతకాలు తీసుకున్న అనంతరం వారిని విడుదల చేయాలని మేజిస్ట్రేట్‌ ఆదేశించారు. వారి తరపున న్యాయవాదులు సౌతిక్‌ బెనర్జీ, దేవికా తుల్సియానీ వాదనలు వినిపించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్