Magazines

నిరసనలపై నిర్బంధం

55 నిమిషాల క్రితం

Detention on protests
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 3 నిమిషాల చదవడం

ఆందోళనకారులపై పెరుగుతున్న పోలీసుల దాష్టీకం

అరెస్టులతో అట్టుడుకుతున్న భారతావని
శాంతియుత ప్రదర్శనలపైనా బలప్రయోగం


న్యూఢిల్లీ : దేశంలో జరుగుతున్న నిరసనలు, ఆందోళనలపై గత కొన్ని నెలలుగా పోలీసుల దాష్టీకం అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రదర్శనకారులపై బలప్రయోగాలు తీవ్ర రూపం దాలుస్తుండడం చర్చనీయాంశంగా మారింది. జులైలోనూ, ఈ నెలలోనూ దేశంలో జరిగిన ఆందోళనలు... ముఖ్యంగా కాక్రోచ్ ఉద్యమంపై ప్రభుత్వ నిర్బంధాలను ఐక్యరాజ్యసమితి వేలెత్తి చూపింది. మితిమీరిన బలప్రయోగాన్ని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తప్పుపట్టింది. నిరసనకారులపై సామూహిక నిర్బంధాలను, దాష్టీకాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే న్యాయస్థానాలలో అనేక వ్యాజ్యాలు దాఖలయ్యాయి. జూలైలో విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పోలీసులు అతిగా ప్రవర్తించి బలప్రయోగానికి దిగిన ఉదంతంపై న్యాయస్థానం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

శాంతియుత ప్రదర్శనల పైనా జులుం

జనవరి నుంచి ఈ నెల రెండవ తేదీ నాటికి మన దేశంలో 18,629 ప్రదర్శనలు జరిగాయని ఆర్మ్‌డ్ కాన్‌ఫ్లిక్ట్స్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా (ఏసీఎలఈడీ) తెలియజేసింది. వీటిలో 17,691 నిరసన ప్రదర్శనలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం శాంతియుతంగా జరిగినవే. 687 ప్రదర్శనలు మాత్రమే హింసాత్మకంగా మారాయి. కనీసం 1,200 నిరసన ప్రదర్శనల్లో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈ ఏడాది పంజాబ్‌లో ఇప్పటి వరకూ అత్యధికంగా 1,834 నిరసన ప్రదర్శనలు జరిగాయి. వీటిలో 61 సందర్భాలలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. 2016తో పోలిస్తే కర్నాటకలో ఈ ఏడాది ప్రదర్శనలు రెట్టింపు (1,169) అయ్యాయి. తమిళనాడులో 1,369 ప్రదర్శనలు జరగగా 209 చోట్ల

పోలీసులు తమ ప్రతాపం చూపారు. తరచుగా నిరసన ప్రదర్శనలు జరిగే జమ్మూకాశ్మీర్‌లో ఈ ఏడాది ఇప్పటివరకూ 1,721 ప్రదర్శనలు జరిగాయి. 47 ప్రదర్శనల్లో పోలీసులు జులుం ప్రదర్శించారు. శాంతియుత ప్రదర్శనలపై సైతం పోలీసులు అతిగా ప్రవర్తించడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో...

ఈ ఏడాది కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనలకు రాజధాని ఢిల్లీయే ప్రధాన వేదిక అయినప్పటికీ అక్కడ జరిగిన మొత్తం ప్రదర్శనల సంఖ్య తగ్గింది. ఢిల్లీలో 2016లో 543 నిరసనలు చోటుచేసుకోగా ఈ ఏడాది ఇప్పటి వరకూ జరిగినవి 364 మాత్రమే. అయితే తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా తెలంగాణలో 2016లో 98 నిరసనలు మాత్రమే జరగగా ఈ ఏడాది ఇప్పటి వరకూ 1,324 జరిగాయి. కాగా ఆగస్టులో దేశంలో జరిగిన ప్రతి 11 నిరసనల్లోనూ ఒక దానిలో పోలీసుల దాష్టీకం కన్పించింది. ఆ నెలలో దేశవ్యాప్తంగా 2,500కు పైగా నిరసనలు జరిగాయి.

ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలు

గత దశాబ్ద కాలంలో రెండో అత్యధిక నిరసనలు జరిగిన సంవత్సరంగా 2026 నమోదైంది. పోలీసులు జోక్యం చేసుకున్న ఘటనలు (250) కూడా ఈ ఏడాదే ఎక్కువ. ఏసీఎలఈడీ డేటా ప్రకారం మన దేశంలో నిరసన ప్రదర్శనల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2016లో 10,642 ప్రదర్శనలు జరగగా 2024లో వాటి సంఖ్య 22,130కి చేరింది. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నాటికి ఆ సంఖ్య 18,629 దాటింది. ఈ ఏడాది ఒక్క ఆగస్ట్ నెలలోనే 200కి పైగా ప్రదర్శనలపై పోలీసులు బలప్రయోగానికి దిగారు. గడచిన దశాబ్ద కాలంలో ఏ నెలలోనూ ఈ స్థాయిలో నిరసనలపై పోలీసులు జోక్యం చేసుకోలేదు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు ఈ ప్రదర్శనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సాధారణంగా శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లినప్పుడు మాత్రమే పోలీసులు జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. శాంతియుతంగా సమావేశమయ్యేందుకు, నిరసన తెలిపేందుకు రాజ్యాంగం అనుమతిస్తున్నప్పటికీ ఆ రాజ్యాంగ రక్షణ ఆచరణలో విఫలమవుతోంది. అంతిమంగా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లు లేదా పోలీసులు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమకు బలప్రయోగం జరిపేందుకు స్వేచ్ఛ ఇవ్వాలని చాలా మంది అధికారులు కోరుకోవడం విశేషం.

అమలుకు నోచని మార్గదర్శకాలు

నిరసన ప్రదర్శనలను అడ్డుకోవడానికి పోలీసులు బారికేడ్లు నిర్మించడం, లాఠీఛార్జి చేయడం, భాష్పవాయు గోళాలు ప్రయోగించడం, నీటి ఫిరంగులను ఉపయోగించడం వంటి చర్యలకు దిగుతారు. 2014 - 2024 మధ్యకాలంలో లాఠీఛార్జి ఘటనల కారణంగా దేశంలో 66 మంది చనిపోయారు. ఈ ఏడాది జూలైలో మహిళా ప్రదర్శకులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారని హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది. చేతులు, కాళ్లపై మాత్రమే లాఠీలు ప్రయోగించాలని అంతర్జాతీయ మార్గదర్శకాలు సూచిస్తున్నప్పటికీ అవి అమలు కావడం లేదు. వాటర్ క్యానన్లను ఉపయోగించినప్పుడు కూడా ఆందోళనకారులు గాయపడుతుంటారు. భాష్పవాయు గోళాల ప్రయోగం నిరసనకారులను అనారోగ్యానికి గురిచేస్తోంది. నిరసనకారులలో నేర చరిత్ర కలిగిన వారు ఎవరైనా ఉన్నారా, ఎంతమంది ఆందోళనలో భాగస్వాములు అవుతున్నారు అనే సమాచారాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ఈ ఏడాది జులైలో ఢిల్లీలో యువత నిర్వహించిన నిరసనల సందర్భంగా ఏఐ నిఘా వ్యాన్లను ఉపయోగించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

అరెస్టులు...ఆంక్షలు

నిరసనలు, ఆందోళనలను అడ్డుకోవడానికి పోలీసులు బలప్రయోగానికి దిగడంతో పాటు అనేక ఇతర పద్ధతులను కూడా అనుసరిస్తున్నారు. నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం, వారిపై ఆంక్షలు విధించడం, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం వంటి చర్యలకు దిగుతున్నారు. జూలైలో యువత ప్రదర్శన జరిపినప్పుడు సెంట్రల్ ఢిల్లీలో మొబైల్ డేటాను ఆపేయాలని టెలికం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. నిరసన జరిగే ప్రదేశానికి సమీపంలో ఉండే మెట్రో స్టేషన్లను మూసివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇటీవల 45 మెట్రో స్టేషన్లను మూసేశారు. నిరసన జరిగే ప్రదేశంలో నిర్బంధాలు నిత్యక త్యమయ్యాయి. ఏకపక్షంగా చేస్తున్న అరెస్టులను నిలిపివేసి, ఆందోళనకారులను విడుదల చేయాలని ఐరాస విభాగం కేంద్రాన్ని కోరింది. పరీక్షా పత్రాల లీకేజీ, సర్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల సందర్భంగా అనేక మంది విద్యార్థులు, ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్