Magazines

అంతరిక్షంలోకి రయ్‌.. రయ్‌..

1 గంట క్రితం

Zooming space
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : అంతరిక్ష ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య ఏటికేడాది పెరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకూ 52 ప్రపంచ దేశాలకు చెందిన 746 మంది అంతరిక్ష ప్రయాణం చేశారు. వీరిలో కెరీర్‌ వ్యోమగాములే కాకుండా పర్యాటకులూ ఉన్నారు. 69 సంవత్సరాల క్రితం అంటే 1957 అక్టోబర్‌ 10వ తేదీన అప్పటి సోవియట్‌ యూనియన్‌ తొలిసారిగా స్పూత్నిక్‌-1ను అంతరిక్షంలోకి ప్రయోగించింది. దీనిని పురస్కరించుకొని ఐక్యరాజ్యసమితి అక్టోబర్‌ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను జరుపుతోంది. నేడు 80కి పైగా దేశాలు కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టాయి. 1961లో సోవియట్‌ వ్యోమగామి యూరీ గగారిన్‌ తొలిసారి అంతరిక్షంలో అడుగు పెట్టాడు. 1967 అక్టోబర్‌ 10న అమెరికా, బ్రిటన్‌, సోవియట్‌ యూనియన్‌ సంతకాలు చేసిన ఔటర్‌ స్పేస్‌ ఒప్పందం అమలులోకి వచ్చింది. అంతరిక్ష అన్వేషణలకు ఈ ఒప్పందం దారి చూపింది. 1969 జూలై 20న నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రునిపై తొలిసారి కాలు పెట్టారు.

ప్రపంచ దేశాలలో అమెరికా అత్యధికంగా ఇప్పటి వరకూ 369 మందిని అంతరిక్షంలోకి పంపింది. సోవియట్‌ యూనియన్‌, రష్యా కలిపి 138 మందిని అంతరిక్షానికి పంపాయి. మూడో స్థానంలో ఉన్న చైనా తన సొంత రాకెట్లలో 29 మందిని పంపింది. ఇప్పటి వరకూ అంతరిక్షయానం చేసిన 746 మందిలో కేవలం 112 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. 1963 జూన్‌లో సోవియట్‌ మహిళా వ్యోమగామి వాలెంటినా టెరెష్కోవా తొలిసారి అంతరిక్షానికి ప్రయాణమయ్యారు. ఆ తర్వాత 20 సంవత్సరాలకు కానీ అమెరికా మహిళా వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపలేదు. 2020 తర్వాత అంతరిక్ష ప్రయాణం చేసిన మహిళల సంఖ్య బాగా పెరిగింది. 2021లో 18 సంవత్సరాల ఒలివర్‌ డేమెన్‌ అంతరిక్షానికి ప్రయాణించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. 90 సంవత్సరాల ఎనిమిది నెలల వయసులోనూ ఎడ్‌ డ్విట్‌ 2024లో అంతరిక్ష ప్రయాణం చేసి రికార్డు సృషించారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఆర్టెమిస్‌-2 సిబ్బంది భూమి నుంచి 2,52,756 మైళ్లు ప్రయాణించి చంద్రుని సమీపానికి వెళ్లారు. భారత్‌ కూడా వచ్చే సంవత్సరం గగన్‌యాన్‌ మిషన్‌కు సిద్ధపడుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్